Apr 20,2023 20:51
  • పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు
  • ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 33కెవి సబ్‌స్టేషన్లకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఇంధన, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని అంశాలు పరిష్కరించేందుకు రాష్ట్రంలోని ప్రతి 33 కెవి సబ్‌స్టేషన్‌కు ఎంపిపి, జెడ్‌పిటిసి, ముగ్గురు రైతులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. వేసవిలో విద్యుత్‌ సరఫరా, విశాఖలో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సులో కుదిరిన ఎంవోయులపై సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. గతంలో తాను మొదట ఎమ్మెల్యే అయిన సమయంలో ఈ తరహా కమిటీలు ఉండేవని, ఇప్పుడు మళ్లీ తాము నియమిస్తున్నామని తెలిపారు. దీనివల్ల విద్యుత్‌ సరఫరా, లోఓల్టేజ్‌ వంటి సమస్యలను స్థానికంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వీలవుతుందని చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్‌లో కుదిరిన అవగాహన ఒప్పందాల(ఎంఓయు)ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 16,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన సామర్ధ్యంతో రూ.82,500కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 10 ప్రాజెక్టులను జులై 15లోపు శంకుస్థాపనలు అయ్యేలా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎంవోయు ప్రకారం పరిశ్రమల ఏర్పాటుకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయి అధికారులతో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రతివారం సమీక్షిస్తారని, తాను రాష్ట్రస్థాయిలో ప్రతి నెలా సమీక్షిస్తాని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సమగ్ర సమాచారంతో కాంప్రెహెన్సివ్‌ ప్రాజెక్టు మోనిటరింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించాలని నెడ్‌క్యాప్‌ అధికారులను ఆదేశించారు. పెట్టుబడులు పెట్టేవారికి సింగిల్‌ విండో అనుమతులు, సదుపాయాల కోసం డిస్కం, ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్‌ అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎంవోయుల్లో 50శాతం పరిశ్రమలైనా త్వరితగతిన ఏర్పాటు చేయించే దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పటివరకూ ఎన్నడూలేని విధంగా విద్యుత్‌ డిమాండ్‌ గురువారం 246.9 మిలియన్‌ యూనిట్ల(ఎంయు) నమోదైందని, అయినా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని వివరించారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు దరఖాస్తు చేసుక్ను వెంటనే కనెక్షన్లు ఇచ్చే సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజాయనంద్‌, జెన్‌కో ఎండి కెవిఎన్‌ చక్రధర్‌ బాబు, ఈపిడిసిఎల్‌ సిఎండి పృథ్వీతేజ్‌, ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌ రెడ్డి, నెడ్‌క్యాప్‌ ఎండి రమణారెడ్డి, సిపిడిసిఎల్‌, ఎస్‌పిడిసిఎల్‌ సిఎండిలు పద్మా జనార్ధన్‌ రెడ్డి, సంతోషరావు తదితరులు పాల్గొన్నారు.