Sep 29,2022 22:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వ్యవసాయ పంపుసెట్లకు 2023 మార్చి నాటికి విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు వీటిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని చెప్పారు. ఇంధనశాఖ అధికారులతో సచివాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. అక్టోబరు 15 నాటికి నూరుశాతం బ్యాంకు ఖాతాలను తెరవడం, ఆధార్‌ లింకింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి తెలిపారు. బ్యాంకులతోపాటు పోస్టాఫీస్‌లలో కూడా రైతులు ఖాతాలు తెరవచ్చునని చెప్పారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఎటువంటి అంతరాయాలూ లేకుండా అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 41 వేల కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసిందని, మరో 77 వేల కనెక్షన్లను త్వరలోనే రైతులకు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించడం వల్ల రైతుపై భారం పడదన్నారు. ఉచిత విద్యుత్‌ భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత విద్యుత్‌ వినియోగానికి ప్రభుత్వం చెల్లిస్తున్న దానికంటే 30 శాతం తక్కువగానే రైతులు వినియోగిస్తున్నారని చెప్పారు. దీనివల్ల 30 శాతం విద్యుత్‌ భారం తగ్గుతుందని గుర్తించామని తెలిపారు. మీటర్ల వల్ల రైతుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. తమ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే సబ్సిడీని వారే స్వయంగా డిస్కమ్‌లకు చెల్లించడం ద్వారా నాణ్యమైన విద్యుత్‌పై వారికి ప్రశ్నించే హక్కును మరింతగా పొందుతారని పేర్కొన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను తెలుసుకున్న ఇథోపియా ఇక్కడ పర్యటించి సర్వే చేసిందన్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇటువంటి వ్యవస్థను తమ దేశాల్లో ఏర్పాటు చేసుకునేందుకు ఆఫ్రికన్‌ దేశాలు ఆలోచిస్తున్నాయని చెప్పారు. ఈ సమీక్షలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌, ట్రాన్స్‌కో సిఎమ్‌డి బి శ్రీధర్‌, జెఎమ్‌డి పృథ్వితేజ్‌, ఇంధనశాఖ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌ రెడ్డి, డిస్కమ్‌ల సిఎమ్‌డిలు కె సంతోషరావు, జె పద్మాజనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.