ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే ఫ్లైయాష్‌తోపాటు కాలుష్య వ్యర్థాలను వెదజల్లే పరిశ్రమలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యావరణ, ఇంధన, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విజయవాడలోని ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో కాలుష్య నివారణ చర్యలపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్తగా ఏర్పాటుచేసిన పోర్టల్‌ను ప్రారంభించి మాట్లాడారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లైయాష్ నిర్వహణను ఇకపై ఎపి ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ పోర్టల్‌లో ఫ్లైయాష్ ఉత్పత్తి, కొనుగోలుదారులు, రవాణాదారులకు సంబంధించిన పూర్తి సమాచారం వుంటుందని తెలిపారు. ఫ్లైయాష్‌ను వినియోగించే సిమెంట్ కంపెనీలు, టైల్స్, రెడీమిక్స్ కంపెనీలు, జాతీయ రహదారుల నిర్మాణం, ఇటుకలు తయారు చేసే పరిశ్రమలను ఒకే ప్లాట్‌ఫామ్‌లోకి తెస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరి నీరబ్ కుమార్ ప్రసాద్, కార్పోరేషన్ ఎమ్‌డి ఖజూరియా, చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్ పాల్గొన్నారు.










