Jul 06,2022 07:39

ప్రజాశక్తి-అమరావతి : గత ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల నుంచి ఆర్థికశాఖకు అందిన బిల్లుల వివరాలను సింగిల్‌ జడ్జికి నివేదించాలని ఆ శాఖను డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. సీల్డ్‌ కవర్‌లో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి శంషేర్‌ సింగ్‌ రావత్‌ అందజేయాలని జస్టిస్‌ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ జి రామకృష్ణప్రసాద్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఆదేశించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ రావత్‌ దాఖలు చేసిన లెటర్‌ పేటెంట్‌ అప్పీల్‌ పిటిషన్‌ను బెంచ్‌ కొట్టేస్తూ తీర్పు చెప్పింది.
     రేపల్లె మండల పరిధిలో సిపిడబ్ల్యుఎస్‌ స్కీమ్‌ కింద చేసిన పనుల బిల్లులను 4 వారాల్లోగా చెల్లించాలని గుంటూరుకు చెందిన పువ్వాడ వెంకట శివప్రసాద్‌ వేసిన కేసులో సింగిల్‌ జడ్జి ఆదేశించారు. ఈ ఉత్తర్వులు అమలు కాలేదంటూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ను ప్రతివాదిగా పేర్కొంటూ పిటిషనరు కోర్టు ధిక్కార కేసు వేశారు. ఈ కేసు విచారణకు రావత్‌ స్వయంగా హాజరై బిల్లులను ప్రాధాన్యత విధానంలో సిఎంఎఫ్‌ఎస్‌ ద్వారా చెల్లిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆర్థికశాఖకు వివిధ శాఖల నుంచి వచ్చిన బిల్లుల వివరాలు నివేదించాలని సింగిల్‌ జడ్జి ఆదేశించారు. కోర్టు ధిక్కరణ కేసుకు సింగిల్‌ జడ్జి ఆదేశాలకు పొంతన లేదని రావత్‌ తరపున న్యాయవాది వాదించారు. ఇదే తరహా కేసులో డివిజన్‌ బెంచ్‌ స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పీల్‌కు విచారణ అర్హత లేదని పిటిషనరు తరపున న్యాయవాది ప్రభునాథ్‌ ప్రతివాదన చేశారు. వాదనల తర్వాత హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పందిస్తూ.. లెటర్‌ పేటెంట్‌ అప్పీల్‌ దాఖలు చేయడం చెల్లదని తీర్పు చెప్పింది. అలాగే సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న కోర్టుధిక్కార కేసు విచారణ 2 వారాలకు వాయిదా పడింది.
 

                                        కోనసీమ అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్‌ నిరాకరణ

కోనసీమ అల్లర్ల కేసులో టిడిపి నేత అరిగెల వెంకట రామారావుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి నిరాకరించారు. రామారావు వేసిన 4 బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేస్తూ తీర్పు చెప్పారు. అల్లర్ల ఫిర్యాదులో, సాక్షుల వాంగ్మూలాల్లో పిటిషనరు పేరు ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయలేమని స్పష్టం చేశారు. పిటిషనరు అమాయకుడని, బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాది రామారావు వాదించారు. వాట్సాప్‌, సోషల్‌ మీడియా ద్వారా పిటిషనరు మెసేజ్‌లు పంపడం వల్ల కోనసీమలో హింస ఎక్కువైందని పిపి ఎస్‌ దుష్యంతరెడ్డి ప్రతివాదన చేశారు. బెయిల్‌ ఇవ్వొద్దన్నారు. ఫిర్యాదులో పేర్లు లేకుండా, వాంగ్మూలాలు ఆధారంగా కేసులు నమోదు చేసిన ఇతరులకు హైకోర్టు మందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.
 

                                                     ఎబి కేసు విచారణ 19కి వాయిదా

డ్రోన్‌ వంటి నిఘా పరికరాల కొనుగోళ్ల పేరులో అక్రమాలకు పాల్పడినట్లుగా తనపై ఎసిబి పెట్టిన కేసును కొట్టేయాలంటూ ఐపిఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావు వేసిన రిట్‌ విచారణ ఈ నెల 19కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ జయసూర్య ఉత్తర్వులు జారీ చేశారు. నిఘా పరికరాల కొనుగోళ్ల పేరుతో ఒక్క రూపాయి కూడా చెల్లింపులు జరగలేదని ఆయన తరపున సీనియర్‌ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదించారు. పిటిషనరుపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఆదేశించిన సుప్రీం కోర్టు ఎసిబి దర్యాప్తునకు అనుమతిచ్చిందని ఎసిబి తరపున న్యాయవాది గాయత్రి రెడ్డి చెప్పారు. కౌంటర్‌ వేస్తామని తెలిపారు.
 

                               రుషికొండ రిసార్టు పునరుద్ధరణ పనుల వివరాలు ఇస్తాం : ప్రభుత్వం

విశాఖలోని రుషికొండ రిసార్టు పునరుద్దరణ ప్రాజెక్టు పనుల వివరాలను అందజేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సమయం కావాలని గవర్నమెంటు స్పెషల్‌ ప్లీడర్‌ సిహెచ్‌ సుమన్‌ కోరడంతో చీఫ్‌ జస్టిస్‌ పికె మిశ్రా, జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ అనుమతించింది. యందాడలోని 19వ సర్వే నెంబరులో కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌లో చెట్లను కొట్టేయడాన్ని సవాల్‌ చేస్తూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ వేసిన పిల్స్‌ను హైకోర్టు విచారణ జరిపింది. 5.18 ఎకరాల్లో నిర్మాణాలకు కేంద్ర, పర్యావరణ అటవీశాఖ ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి కొండను తవ్వేస్తున్నారని పిటిషనరు వాదన. కొండలు కరిగిపోతే మళ్లీ వాటిని ఎలా ఏర్పాటు చేసుకోగలమని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాత ఫొటోలను పిటిషనర్లు కోర్టుకు ఇచ్చారని, తాజా వివరాలను నివేదించేందుకు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. అడ్వకేట్‌ కమిషన్‌ను నియమిస్తామని హైకోర్టు ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ వివరాల నిమిత్తం విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.
 

                                                                జంతు వథపై చర్యలు

జంతు వథ, అక్రమ రవాణాను చట్ట ప్రకారం నిరోధించాలని పోలీసులకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పికె మిశ్రా, జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. ఈ వ్యవహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నోడల్‌ అధికారులను నియమించాలని బెంచ్‌ ఆదేశించింది. బక్రీద్‌ పండగ పేరుతో జంతు వథను, అక్రమ రవాణాను అడ్డుకోవాలంటూ యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ కార్యదర్శి గోపాలరావు, మరో రెండు పిల్స్‌పై హైకోర్టు పై ఉత్తర్వులు జారీ చేసి విచారణను ముగించింది.