Sep 21,2023 15:32

ప్రజాశక్తి-మైలవరం(ఎన్‌టిఆర్‌) : అర్హులకే అసైన్‌ భూములపై హక్కులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. దళిత రక్షణ యాత్రలో భాగంగా మండలంలోని ముసుమల్లి, పుల్లూరు, దాసులపాలెం, సబ్జపాడు, మైలవరంలోని ఎస్సీ కాలనీలో గురువారం బైక్‌ యాత్ర నిర్వహించి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌ భూముల చట్ట సవరణ కోసం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ వెంటనే రద్దు చేయాలని జస్టిస్‌ పున్నయ్య కమిటీ సిఫార్సులో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్యాకరాంతమైన భూములను తిరిగి అర్హులైన పేదలకు హక్కులు కల్పించాలన్నారు. కార్పొరేట్లు, భూస్వాములు, పెత్తందారులకే లబ్ధి చేకూర్చటానికి అసైన్డ్‌ చట్టాన్ని సవరణ చేస్తున్నారని విమర్శించారు. చట్ట సవరణ ఆర్డినెన్స్‌ కు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో పేదలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి ఆనందరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లవరపు కుటుంబరావు, సిఐటియు మైలవరం మండల కార్యదర్శి సిహెచ్‌ సుధాకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు లంక వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి నాగేశ్వరరావు,మంద స్వామి, ముత్యాలరావు, నాగమణి, యోహాను, అబ్రహం, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.