యశ్ దూబే, రజత్ పాటిదార్ అర్ధసెంచరీలు
సెమీస్‌కు మధ్యప్రదేశ్
ఇండోర్: డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్‌జట్టు రంజీట్రోఫీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్‌ఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఆంధ్రాపై విజయం సాధించింది. ఓపెనర్ యశ్ దూబే, రజత్ పాటిదార్ అర్థ సెంచరీలతో రాణించారు. 245పరుగులు ఛేదనలో భాగంగా ఓవర్‌నైట్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ జట్టు 77ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శుభమ్ శర్మ(40), శరన్స్ జైన్(28) కూడా బ్యాటింగ్‌లో రాణించారు. లలిత్, పృథ్వీ రాజ్‌కు రెండేసి, నితీశ్ కుమార్‌కు ఒక వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పృథ్వీ రాజ్‌కు లభించింది. ఇతర క్వార్టర్‌ఫైనల్ పోటీల్లో కర్ణాటక జట్టు 281పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై, బెంగాల్ జట్టు 9వికెట్ల తేడాతో జార్ఖండ్‌పై గెలిచి సెమీస్‌కు చేరాయి. ఇక సౌరాష్ట్ర-పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మరో క్వార్టర్‌ఫైనల్లో పంజాబ్ జట్టు శనివారం 97ఓవర్లలో 200పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఇక మధ్యప్రదేశ్ సెమీఫైనల్లో బెంగాల్ జట్టుతో అమీతుమీకి సిద్ధమైంది. ఫిబ్రవరి 8న సెమీస్ పోరు జరగనుంది.










