Jul 20,2023 09:11
  •  లబ్ధిదారుల ఖాతాలో రూ.9 వేలే జమ
  •  పూర్తి డబ్బులు రాక ఆందోళన

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, కవిటి, జి సిగడాం : శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన జీరు కుమారి, బోరుభద్ర లక్ష్మి, ఎండ్రాపు కుమారి, కొరికాన భారతి గత పదిహేను రోజులుగా అమ్మఒడి డబ్బుల కోసం అటు బ్యాంకు, ఇటు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం బ్యాంకుకు వెళ్లి తమ పాస్‌పుస్తకాలు సరిచూసుకున్న వారికి చెరో రూ.9 వేలు చొప్పున ఖాతాలో జమైనట్టు చూపించింది.
జి.సిగడాం మండలం బురిడి కంచరాంలో పదిమంది తల్లులు తమకు డబ్బులు పడ్డాయని తెలియడంతో నగదు తీసేందుకు గ్రామంలోని మినీ ఎటిఎం దగ్గరకు వెళ్లారు. డబ్బులు ఎంత జమ అయ్యాయో తెలుసుకుని విత్‌డ్రా చేయాలనుకున్నారు. మీ ఖాతాల్లో తొమ్మిది వేలే పడ్డాయని బదులివ్వడంతో చేసేది లేక ఆ డబ్బులను తీసుకుని వచ్చేశారు. రాష్ట్ర మంతటా బుధవారం డబ్బులు జమ అయిన లబ్దిదారుల అందరి ఖాతాల్లోనూ ఇదే రీతిన రూ.9 వేలు పడినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత నెల 28న అమ్మఒడి నాల్గో విడత డబ్బుల జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. మూడు వారాలు గడిచినా ఇంకా లక్షలాది మందికి డబ్బులు జమకాలేదు. కొందరి తల్లుల బ్యాంకు ఖాతాల్లో బుధవారం డబ్బులు పడ్డాయన్న సమాచారంతో తమ ఖాతాల్లో నుంచి డబ్బులు తీసేందుకు బ్యాంకులకు వెళ్లారు. నగదు జమ చూసుకునే సరికి రూ.9 వేలే కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. అమ్మఒడి కింద ప్రభుత్వం ఈ ఏడాది రూ.13 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. పూర్తి సొమ్ము రాకపోవడంపై తల్లులు సచివాలయాలకు పరుగులు తీశారు. తమకు తెలియదని సచివాలయ సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు

  • విద్యా శాఖ వద్దాలేని సమాచారం

తల్లుల ఖాతాల్లో రూ.13 వేలకు బదులుగా రూ.9 వేలే పడడానికి కారణంపై విద్యా శాఖాధికారుల వద్ద కూడా సమాచారం లేదు. విశాఖపట్నం రీజియన్‌ ఆర్‌జెడి ఎం.జ్యోతికుమారిని వివరణ అడగగా, తమకు సమాచారం లేదని, కనుక్కుని చెప్తానని తెలిపారు.

మిగిలిన డబ్బులు ఎప్పుడొస్తాయో : కొరికాన భారతి, ప్రగడ పుట్టుగ (శ్రీకాకుళం జిల్లా)

మా పిల్లలు సంజన, శరణ్య... కవిటి ప్రభుత్వోన్నత పాఠశాలలో చదువు తున్నారు. అమ్మఒడి కోసం గత 15 రోజులుగా ఎదురు చూస్తున్నాం. బుధవారం ఉదయం నా భర్త బ్యాంకుకు వెళ్లి డబ్బులు పడ్డాయో లేదో చూశారు. బ్యాంకు పాస్‌పుస్తకం ప్రింట్‌ తీస్తే రూ.9 వేలు మాత్రమే వచ్చినట్టు ఉంది. అమ్మఒడి కోసం ఎదురు చూస్తున్న కొంతమందిని వాకబు చేస్తే వారికీ రూ.9 వేలే వచ్చినట్టు చెప్పారు. మిగిలిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు