డ్రాప్ అవుట్స్ ప్రభావంతో భారీగా తగ్గుదల
బియ్యం కార్డుల తొలగింపు కారణమంటున్న అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :రాష్ట్రంలో 3, 4, 5 పాఠశాలల విలీనం, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, విద్యా వ్యవస్థలో గతేడాది కాలంలో జరిగిన మార్పుల వల్ల ఈ ఏడాది అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతేగాక ఆరు సూత్రాల విధానం వల్ల బియ్యం కార్డుల రద్దు ప్రభావమూ లబ్ధిదారుల కుదింపుపై పడింది. మొత్తంగా గతేడాది కన్నా ఈ ఏడాది 1.34 లక్షల మంది విద్యార్థుల తల్లులు అమ్మఒడికి దూరం కావాల్సి వచ్చింది. గుంటూరు జిల్లాలో గతేడాది 1.64 లక్షల మంది అమ్మఒడి కింద లబ్ధి పొందారు. ఈ ఏడాది 1.59 లక్షల మందికి మాత్రమే ఆ అవకాశం దక్కింది. మరోవైపు ఆదివారం వలంటీర్లకు జాబితాలు పంపి సోమవారం రాత్రిలోగా తల్లుల వద్ద బయోమెట్రిక్ ద్వారా అథంటిఫికేషన్ తీసుకోవాలని చెప్పడంతో కొంతమంది అందుబాటులోలేక ఆథరైజేషన్ ఇవ్వలేకపోయారని సమాచారం. ఇకెవైసి సమస్య, ఇతర సాంకేతిక కారణాలతో వందలాదిమంది తల్లులు ఈ పథకానికి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతేడాది పాఠశాలల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఈ ఏడాది పాఠశాలలు పున:ప్రారంభానికి ముందే జిల్లా అధికారుల నుంచి వివరాలు సేకరించి జాబితాలను ఆమోదించింది. వీటిని సోషల్ ఆడిట్‌కు పంపిన విద్యా శాఖ ఉన్నతాధికారులు తల్లుల నుంచి ఇకెవైసిని సచివాలయ అధికారులు వలంటీర్ల ద్వారా నమోదు చేయించారు. ఈ ప్రక్రియ కేవలం 48 గంటల ముందు చెప్పడంతో కొంతమందికి ఇకెవైసి జరగలేదని సమాచారం. గత విద్యా సంవత్సరంలో ఎయిడెడ్ వ్యవస్థలో మార్పులు, పాఠశాలల విలీనం ప్రభావంతో చాలామంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు. ప్రతి జిల్లాలో డ్రాప్ అవుట్స్ పెరిగాయి. పాఠశాలలకు దూరం అయిన వారిని చాలా ఆలస్యంగా అధికారులు గుర్తించి తిరిగి పాఠశాలలకు రప్పించేసరికి వారు దాదాపు రెండు నెలలు అటెండెన్సును కోల్పోయారు. 75 శాతం అటెండెన్సు నిబంధన వల్ల కొంతమంది ఈ పథకానికి దూరం అయ్యారు. విలీనం సమస్య వల్ల కొంతమంది విద్యార్థులను పాఠశాలలకు పంపకపోవడం వల్ల హాజరు శాతం తగ్గిందని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఆరు సూత్రాల విధానం పేరుతో ప్రతి జిల్లాలో కనీసం ఐదు నుంచి ఆరు వేల వరకు బియ్యం కార్డులు తగ్గించారు. కొన్ని కార్డులు తగ్గించినా మళ్లీ అదే స్థాయిలో కార్డులు ఇచ్చామని చెబుతున్నా, అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య ఈ ఏడాది తగ్గింది. విద్యుత్ వినియోగం 300 యూనిట్లపైన ఉండే వారిని అనర్హులుగా పేర్కొన్నారు. నాలుగు చక్రాల వాహనం, పట్టణాల్లో వెయ్యి అడుగులపైన ఇల్లు, ఇన్‌కంటాక్సు రిటర్నులు దాఖలు చేసే వారిని, ఆధార్, బ్యాంకు ఖాతాలకు లింకు కానీ వారిని అమ్మఒడికి అర్హులుగా పరిగణించలేదు.










