- వేధిస్తున్న టీచర్ల కొరత
- ప్రైవేట్ బాట పడుతున్న విద్యార్ధులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో నాడుానేడు ద్వారా మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. జగనన్న విద్యాకానుక(జెవికె) ద్వారా బూట్లు, బట్టలు, పుస్తకాలను అందిస్తోంది. స్మార్ట్ టివిలు, ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ను అమర్చడంతో పాటు విద్యార్ధులకు ట్యాబులు కూడా ప్రభుత్వమే అందిస్తోంది. ఇంత చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు సంఖ్య మాత్రం పెరగడం లేదు. ప్రభుత్వ బడి కాదని వేలకు వేలు ఫీజులు కడుతూ పుస్తకాలు కొంటూ ప్రైవేట్ బడి బాట పడుతున్నారు. సంస్కరణల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన విలీన ప్రక్రియ సర్కార్ బడికి శాపంగా మారింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను 3 కిలోమీటర్ పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో కలిపారు. దీంతో విలీన పాఠశాలల్లో 1,2 తరగతుల విద్యార్ధుల సంఖ్య 20లోపే ఉంది. ఇక్కడ విద్యాహక్కు చట్టం పేరుతో రాష్ట్రప్రభుత్వం ఈ పాఠశాలలకు ఒక్క టీచర్‌నే మిగిల్చింది. సుమారు 14వేల పాఠశాలలు సింగిల్ టీచర్‌గా మారాయి. దీంతో టీచర్ ఒక్కరే తల్లిదండ్రులకు కనపడటంతో అమ్మఒడి డబ్బులతో ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. విలీనం ప్రభావం వల్ల గత ఏడాదే విద్యార్ధుల సంఖ్య భారీగా తగ్గింది. 2021ా22 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45,60,041 మంది చదివారు. ఈ సంఖ్య 2022ా23 నాటికి 39,96,064కు పడిపోయింది. ప్రస్తుత విద్యాసంవత్సరం ఈ సంఖ్య 36 లక్షలకు పడిపోయింది. ప్రతి ఏటా సుమారు 4లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమవుతున్నారు. పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు ఆగస్టు 30వ తేదితో ముగుస్తుంది. ఈ లోపు పిల్లలు పెరుగుతారో, తగ్గుతారో తెలియదు. విలీనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు చేరడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాయి. ప్రభుత్వం మాత్రం పిల్లల పుట్టే శాతం తగ్గుతోందని, అందుకే చేరే వారి శాతం తగ్గుతోందని ఉపాధ్యాయ సంఘాల మొరను ఆలకించడం లేదు.
- టీచర్ల కొరత, ఉన్నవారిపై భారం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయల కొరత వేధిస్తోంది. విలీన ప్రక్రియ వల్ల సుమారు 14వేల పాఠశాలల్లో ఒక్కరే ఉన్నారు. ఈ ఒక్క టీచరే రెండు అన్ని తరగతులకు బోధించడంతో పాటు మధ్యాహ్న భోజనం పథకం నమోదు, జెవికె కిట్ల నమోదు వంటి బోధనేతర పనులను కూడా చూసుకోవాలి. జివో 117 వల్ల విద్యార్ధి, ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రభుత్వం మార్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది ఉంటే ఒక టీచర్, 60 మంది ఉంటే ఇద్దరు టీచర్లనే మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. 1 నుంచి 5 తరగతులకు చెందిన ఐదు సబ్జెక్టులను ఒక్కరు, ఇద్దరు టీచర్లు ఎలా బోధిస్తారనే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. గతంలో విద్యార్ధుల సంఖ్యను బట్టి ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను కేటాయించిన విద్యాశాఖ ఈ సారి సెక్షన్లు బట్టి కేటాయించింది.
గతంలో 140 మంది విద్యార్ధులు ఉన్న ఉన్నత పాఠశాలల్లో 7గురు సబ్జెక్టు టీచర్లతో పాటు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టుతో పాటు, పిఇటి పోస్టు కలిపి 9 మంది టీచర్లు ఉండేవారు. ఇప్పుడు పిఇటి, హెచ్‌ఎం పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్ధుల సంఖ్య 98లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను రద్దు చేసింది. దీంతో ఉన్న టీచర్లపై పనిభారం పెరుగుతోంది. ప్రభుత్వం మాత్రం సరిపడ ఉపాధ్యాయులు ఉన్నారని చెబుతోంది.
మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య
విద్యాసంవత్సరం విద్యార్ధుల సంఖ్య
2021-22 45,60,041
2022-23 39,96,064
(ప్రస్తుతం)2023-24 34,55,288










