- 118 పాఠశాలలు మూత ?
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావం పాఠశాలల మూతకు దారి తీసింది. విద్యాశాఖలో తీసుకొచ్చిన తరగతుల విలీనం విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా 118 ప్రాథమిక పాఠశాలలు మూతపడనున్నాయి. 4,234 పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం విలీనం చేశారు. ఈ తరగతులను తరలించడంతో మిగిలిన 1, 2 తరగతుల పిల్లల సంఖ్య తగ్గింది. కేవలం రెండు తరగతులే అక్కడ ఉండటం, పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం, ఉపాధ్యాయుడు ఒక్కడే బోధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. పిల్లలు లేరని కారణం చూపుతూ 118 పాఠశాలలను మూసేయాలని విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
అనంతపురం జిల్లా హెచ్ సోదనపల్లి ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను దగ్గర్లోని ఉన్నత పాఠశాలలో గతేడాది విలీనం చేయడంతో ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది అక్కడ కొత్తగా ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఉన్నవారు ప్రైవేటు పాఠశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఈ బడి అక్కడ నడవడం లేదు. ఇదే జిల్లా గుత్తి మండలంలోని బసినేపల్లి పాఠశాలలో కూడా విలీనం చేపట్టంతో గతేడాది 8 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఈ పాఠశాలను కూడా మూసేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శాఖమూరులో ఉన్న ప్రాథమిక పాఠశాలలో కూడా విద్యార్థులు లేకపోవడంతో దీనిని కూడా మూసేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తరగతుల విలీనం చేయొద్దని, పాఠశాలలు మూతపడతాయని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఎయిడెడ్ పాఠశాలలు మూత ?
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరితో ఎయిడెడ్ పాఠశాలలు కూడా మూతపడే పరిస్థితి నెలకొంది. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే అక్కడున్న ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించి సొంతగానే నడుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేవలం తక్కువ సంఖ్యతో మాత్రమే ప్రభుత్వానికి ఆయా యాజమాన్యాలు అప్పగించాయి. మిగిలిన వాటిల్లో చాలామంది పాఠశాలలను నిర్వహించడం లేదు. ఉన్న విద్యార్థులను వేరే పాఠశాలకు పంపి మూసేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలోని సెయింట్ థెరిస్సా ఎయిడెడ్ పాఠశాల, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీ విక్టోరియా ఎయిడెడ్ పాఠశాల, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని ఆర్‌సిఎం ఎయిడెడ్ పాఠశాలలను ఆయా యాజమాన్యాలు మూసివేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది సుమారు 100 పాఠశాలలు మూతవేసేందుకు సిద్ధమయ్యాయి.










