Jun 18,2023 08:09
  • దర్యాప్తులో పస లేదు
  • కట్టుకథలు సృష్టించారు
  • ఆధారాలు చూపలేకపోయారు
  • సాక్షుల విశ్వసనీయతపై అనుమానాలున్నాయి

న్యూఢిల్లీ : 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లు గుర్తున్నాయా?. ఆ హింసాకాండలో 53 మంది ప్రాణాలు కోల్పోగా 700 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఫిబ్రవరి 23 నుండి 27వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు దేశ రాజధానిలోని ఈశాన్య ప్రాంతం హింసతో అట్టుడికిపోయింది. ఢిల్లీ పోలీసులు 758 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే విచారణ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆజమాయిషీలో నడిచే ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై న్యాయస్థానాలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశాయి. పలు కేసులలో నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టిన న్యాయస్థానాలు, పోలీసులు సాక్ష్యాలను సృష్టించారని, వారి వాదనలో పస లేదని, దర్యాప్తు పేలవంగా ఉందని మండిపడ్డాయి. కొన్ని కేసుల విషయంలో పోలీసులు జరిపిన విచారణ విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించాయి. పలు కేసులలో నిర్దోషులుగా తేలిన బాధితులు చేయని నేరాలకు అనేక నెలల పాటు కారాగారంలో మగ్గాల్సి వచ్చిందని, కొందరైతే సంవత్సర కాలానికి పైగా జైలులో గడిపారని గుర్తు చేశాయి.
            ఢిల్లీ పోలీసుల వివక్ష పైన, అస్తవ్యస్థంగా జరిగిన విచారణ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ న్యాయమూర్తులు వెలువరించిన తీర్పుల ప్రతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. పోలీసులు న్యాయస్థానాల విలువైన సమయాన్ని వృథా చేయడమే కాకుండా పలు కేసులలో కట్టుకథలు అల్లి వాటిని ఏ విధంగా సాక్ష్యాలుగా చూపారో బయటపడింది.
           ఇర్షాద్‌ అహ్మద్‌ అనే నిందితుడికి ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ రెండు వారాల పాటు సాక్షులు మౌనం వహించడాన్ని బట్టి చూస్తే వారి విశ్వసనీయతపై తీవ్రమైన అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించింది. నిందితులను గుర్తించిన విక్రమ్‌, పవన్‌ అనే కానిస్టేబుళ్లు సంఘటన జరిగిన రోజు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, కనీసం తమ సీనియర్లకు తెలియజేయలేదని ఎత్తిచూపింది. ఫిబ్రవరి 25న జరిగిన సంఘటనకు సంబంధించి మార్చి 6న స్టేట్‌మెంట్లు నమోదు చేసే వరకూ వారిద్దరూ మౌనంగానే ఉన్నారని తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌లో అహ్మద్‌ పేరే లేదని, ఆయనపై నిర్దిష్ట ఆరోపణలు కూడా చేయలేదని ప్రస్తావించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా ఆయన ఎక్కడా కన్పించలేదని న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. దుకాణంపై దాడి చేసిన ఇతర వ్యక్తులను గుర్తించి, అరెస్ట్‌ చేయాల్సి ఉందన్న ఏకైక కారణంతో అహ్మద్‌ను జైలులో పెట్టారంటూ పోలీసుల తీరుపై మండిపడింది.
             మరో కేసులోనూ సాక్షులుగా ఉన్న పోలీసుల విశ్వసనీయతను కోర్టు ప్రశ్నించింది. ఫిబ్రవరి 24వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజ్‌లపై పోలీసులు ఆధారపడ్డారని, కానీ సంఘటన జరిగింది ఆ మరునాడని ఎత్తిచూపింది. నిందితులుగా చూపిన ఇద్దరు ముస్లింలను పోలీసులు సంఘటనా స్థలంలో అరెస్ట్‌ చేయలేదని, 55 రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. కాగా సరైన ఆధారాలు లేవంటూ మరో కేసులో నలుగురు నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఫిబ్రవరి 24న వీరు అల్లర్లకు పాల్పడ్డారని, వాహనాలు తగలబెట్టారని, దోపిడీ చేశారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. అయితే పోలీసులు తగిన ఆధారాలు చూపలేకపోయారని, ఎఫ్‌ఐఆర్‌లో కూడా వారి పేర్లు చేర్చలేదని హైకోర్టు తెలిపింది. సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, మార్చి 14న సాక్షుల స్టేట్‌మెంట్లు నమోదు చేశారని వివరించింది. అరెస్టయిన వారందరూ ముస్లింలే.
             అల్లర్లకు సంబంధించి అనేక ఆరోపణలపై అరెస్ట్‌ చేసిన రషీద్‌ అనే వ్యక్తి పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. ఆయన ప్రమేయాన్ని కూడా నిరూపించలేకపోయారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే సంఘటన జరిగిన 55 రోజుల తర్వాత రషీద్‌ను అరెస్ట్‌ చేశారు. మెడికల్‌ షాపును లూటీ చేస్తుండగా రషీదును చూశానని చెప్పిన కానిస్టేబుల్‌, ఆ విషయాన్ని స్టేషన్‌లో ఎందుకు చెప్పలేదని కోర్టు ప్రశ్నించింది.
కాగా పోలీసులు సాక్షులుగా చూపిన వారిలో ఒకరి పేరును పలు కేసులలో ప్రస్తావించడాన్ని న్యాయస్థానం గుర్తించింది. ఒకే సమయంలో రెండు సంఘటనలను సాక్షి ఎలా చూడగలడని ప్రశ్నించింది. కాగా ఫిబ్రవరి 25న సురేష్‌ అనే వ్యక్తి అల్లరిమూకతో కలిసి ఒక షాపు తాళం పగలగొట్టి దోపిడీకి పాల్పడ్డాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. 2020 ఏప్రిల్‌ 7వ తేదీన అతనిని అరెస్ట్‌ చేయగా 2021 ఫిబ్రవరి 25న బెయిల్‌ వచ్చింది. అల్లరిమూకలో సురేష్‌ ఉన్నాడన్న విషయాన్ని పోలీసులు రుజువు చేయలేకపోయారని కోర్టు తెలిపింది. మరో కేసులో కూడా ముగ్గురు నిందితులను న్యాయస్థానం నిర్దోషులుగా విడిచిపెట్టింది. కేసు విచారణలో ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించడంలో పోలీసులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. సంఘటనను పోలీస్‌ స్టేషన్‌లో తెలియజేయడంలో జరిగిన జాప్యాన్ని గమనిస్తే ఈ కేసులో కానిస్టేబుల్‌ను వాడుకున్నారేమోనన్న అనుమానం కలుగుతోందని తెలిపింది. కేవలం చార్జిషీటు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, ప్రత్యక్ష సాక్షులను గుర్తించేందుకు, అసలైన దోషులను పట్టుకునేందుకు ప్రయత్నమే చేయలేదని అభిశంసించింది.
             అస్పష్టమైన ఆధారాలతో, సాధారణమైన ఆరోపణలతో ఓ గుంపుపై హత్యారోపణలు చేయరాదని చెబుతూ ఢిల్లీ హైకోర్టు ఐదుగురు నిందితులకు బెయిల్‌ ఇచ్చింది. ఈ ఐదుగురు ముస్లింలను వేర్వేరు సందర్భాలలో అరెస్ట్‌ చేశారు. వీరందరూ 12 నుండి 18 నెలల పాటు జైలులో గడపాల్సి వచ్చింది. వీరిని జైలులో పెట్టడానికి కావాల్సిన ఆధారాలేవీ లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా దర్జీ షాపును తగలబెట్టారన్న ఆరోపణతో అరెస్టయిన నూర్‌ మహమ్మద్‌ అనే వ్యక్తిని కోర్టు నిర్దోషిగా విడిచిపెడుతూ విచారణాధికారి పరస్పర విరుద్ధమైన స్టేట్‌మెంట్లు ఇచ్చారని తెలిపింది. మరో కేసులో సాక్షుల వాంగ్మూలం అనుమానాస్పదంగా ఉందని అంటూ ఇద్దరు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఇంకొక కేసులో విచారణ నాణ్యత సరిగా లేదంటూ న్యాయస్థానం పోలీసులను తప్పుపట్టింది. ముగ్గురు నిందితులనూ నిర్దోషులుగా వదిలిపెట్టింది. పోలీసులు 27 కేసులను కలిపేసి విచారించారని తెలిపింది. ఒకే ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదుదారుల పేర్లు రెండుసార్లు పేర్కొన్నారని ప్రస్తావించింది.
           వివిధ కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే పోలీసుల విచారణ ఎంత పేలవంగా జరిగిందో అర్థమవుతుంది. సాక్షుల వాదనలు అనుమానాస్పదంగా ఉన్నాయని, పోలీసులు చూపిన ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని, విచారణలో ఉదాశీనత కన్పించిందని, నేరాలను నిరూపించడంలో దారుణంగా విఫలమయ్యారని, పోలీసుల సాక్ష్యం విశ్వసనీయంగా లేదని.... ఇలా వేర్వేరు వ్యాఖ్యలతో పోలీసుల తీరును న్యాయస్థానాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే పోలీసులు తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేసిన వారిలో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీలే.