Oct 11,2023 08:53

-కలెక్టరేట్ల వద్ద 36 గంటల దీక్షలు, వంటా-వార్పు
-సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్లో 'చలో విజయవాడ'
-ఎపి వెలుగు విఒఎ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం
ప్రజాశక్తి-యంత్రాంగం:మూడేళ్ల వరకే ఉద్యోగం ఉండేలా విడుదల చేసిన కాలపరిమితి సర్క్యులర్‌ 64ను వెంటనే రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వెలుగు విఒఎలు (యానిమేటర్లు) మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల నిరసన దీక్షలకు దిగారు. కలెక్టరేట్ల వద్ద వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. రాత్రి అక్కడే నిద్రించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్న 28 వేల మంది యానిమేటర్ల కుటుంబాలు ప్రభుత్వం అనాలోచనతో విడుదల చేసిన 64వ సర్క్యులర్‌ వల్ల రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించుకొని మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలగించిన యానిమేటర్లను అందరినీ వెంటనే విధులోకి తీసుకోవాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం, సిఐటియు, ఎపి కౌలు రైతు సంఘం, ఐద్వా నాయకులు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు పాల్గని యానిమేటర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.
అనకాపల్లి కలెక్టరేట్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎపి వెలుగు విఒఎ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.రూపాదేవి మాట్లాడుతూ విఒఎలపై పని భారం పెంచడం తగదని, లక్ష్యాల పేరుతో వేధింపులకు గురి చేయడం దారుణమని అన్నారు. పొమ్మనకుండా పొగబెట్టే చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
బాపట్లలో పాత బస్టాండ్‌ వద్ద ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. విత్తనాలు అమ్మడం, గేదెలు, గొర్రెల యూనిట్లను కొనుగోలు చేయించడం లాంటివి టార్గెట్‌ రూపంలో పెట్టి యానిమేటర్లను మానసిక ఒత్తిడికి గురిచేస్తుండడం శోచనీయమన్నారు. ప్రభుత్వ ఒత్తిడి, పనిభారం కారణంగా యానిమేటర్లు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్లో 'చలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపు ఇస్తామన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌ వద్ద 36 గంటల ధర్నాను పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడుతూ యానిమేటర్ల జీతం రూ.పది వేలకు పెంచుతానని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నేటికీ రూ.ఎనిమిది వేలే ఇవ్వడం దారుణమన్నారు. యానిమేటర్ల ఉద్యోగాలను మూడు సంవత్సరాలకే పరిమితం చేసే అధికారం ముఖ్యమంత్రి జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. స్కీమ్‌ వర్కర్లపై పని ఒత్తిడి పెరిగిందన్నారు.
అమలాపురం కలెక్టరేట్‌ ఎదుట యానిమేటర్ల ఆందోళనలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. యానిమేటర్లకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని, మెర్జింగ్‌ను నిలిపేయాలని, బకాయిలు చెల్లించాలని, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. 15 సంఘాలలోపు ఉన్న వారికి జీతాలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. అనరతపురం, రాయచోటి, నంద్యాల, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, శ్రీకాకుళం కలెక్టరేట్ల వద్ద, కర్నూలులో ధర్నా చౌక్‌లో, విశాఖలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, రంపచోడవరం ఐటిడిఎల వద్ద యానిమేటర్లు ఆందోళనకు దిగారు.