- చంద్రబాబుతో నారాయణ, భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : 'స్కిల్' స్కామ్‌కు సంబంధించిన కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుతో మాజీ మంత్రి నారాయణ, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి శుక్రవారం ములాఖత్ అయ్యారు. ఉదయం 11 గంటల నుంచి 40 నిమిషాల పాటు వారు చంద్రబాబును కలిశారు. అనంతరం జైలు వెలుపల ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద నారాయణ మాట్లాడారు. చంద్రబాబు మనోధైర్యాన్ని కోల్పోలేదన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్.స్వామినాథన్ మృతికి ఆయన సంతాపం తెలియజేయాలని తనతో చెప్పారన్నారు. మద్దతు తెలుపుతున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. వైసిపి ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పార్టీ శ్రేణులను కోరారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌కు సంబంధించి లోకేష్‌పై కేసు పెట్టారన్నారు. తాను 2001లో ఈడుపుగల్లులో 40 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని, దీని విలువ రూ.7 కోట్లు ఉంటుందని, ఇన్నర్ రింగ్ రోడ్డులో ఈ భూమిని కోల్పోయానని తెలిపారు. సొంత భూమినే పోగొట్టుకున్న వాడిని అవినీతికి పాల్పడతానా? అని ప్రశ్నించారు. జనసేన పొత్తుపై ఉమ్మడి కమిటీ వేస్తామని తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. టిడిపికి వస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే తమ నాయకులపై అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, వైసిపి సర్కారు కుట్రల వల్ల తమ పార్టీకి మరింత ప్రజాదరణ పెరుగుతుంది తప్ప, తగ్గట్లేదన్నారు.
విధుల్లో చేరిన జైలు సూపరింటెండెంట్
కొన్ని రోజులుగా సెలవులో ఉన్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం విధుల్లో చేరారు. ఆయన భార్య కిరణ్మయి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. ఈ సమయంలో ఆయన సెలువు తీసుకున్నారు. అధికారుల ఒత్తిళ్ల వల్లే సెలవు తీసుకున్నారనే అసత్య ప్రచారం ఆ సమయంలో జరిగింది.










