Oct 14,2022 16:33

హైదరాబాద్‌: మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని,సవరించిన ఓటరు జాబితాను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని బిజెపి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ''2018 అక్టోబరు 12న మునుగోడులో 2,14,847 ఓటర్లు ఉన్నారు. ఈనెల 11వ తేదీ నాటికి మునుగోడు ఓటర్ల సంఖ్య 2,38,759కి చేరింది. 25,013 మంది కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 12,249 కొత్త ఓటర్లకు ఓటు హక్కు కల్పించి.. మిగతా 7,247 తిరస్కరించాం. మరో 5,517 ఫారం-6లు పెండింగులో ఉన్నాయి. మునుగోడు ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తవుతుంది'' అని రాష్ట్ర ఎన్నికల అధికారి నివేదికలో పేర్కొన్నారు.
వాదనలు విన్న ధర్మాసనం.. మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలివ్వాలన్న అంశంపై ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. సవరించిన ఓటరు జాబితాను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.