Feb 02,2023 21:55

న్యూఢిల్లీ: ఐసిసి అండర్‌19 మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ను గెలిచిన టీమిండియా జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన భారత జట్టు అమ్మాయిలకు కుటుంబ సభ్యులు, అధికారులు, అభిమానులు పూలదండలు, పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన జి. త్రిషా, యషశ్రీలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఇతర అధికారులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రీడాకారులు వరల్డ్‌ కప్‌లో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. మొదటి టీ20 వరల్డ్‌ కప్‌లో ఉండటం, కప్పు గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్రికెట్‌ మాత్రమే కాకుండా ప్రతీ క్రీడలో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నారు.