Jul 03,2022 09:07

పశ్చిమ ఏజెన్సీ విస్తీర్ణం చిన్నదే అయినా గిరిజనుల భూములు 60 వేల ఎకరాలు అన్యాక్రాంతమైపోయాయి. సాంప్రదాయకంగా తాము తాత, ముత్తాతల నుండీ పోడు కొట్టుకొని, జీవనాధారంగా చేసుకొన్న భూములు మైదాన ప్రాంతం నుండి దఫ దఫాలుగా వలస వచ్చిన వారి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాయి. తమస్వంత భూముల్లోనే తాము కూలీలుగా బతకాల్సిన దుస్థితికి గిరిజనులు నెట్టబడ్డారు. కూలి దోపిడీ ఎక్కువగానే ఉండేది. భూబదలాయింపు నిరోధక చట్టాలు (1/59, 1/70) ఉన్నా అధికారుల, పాలకపక్షాల దన్నుతో గిరిజనేతర భూస్వాములు వేలాది ఎకరాలు చట్టవిరుద్ధంగా, మోసపు పద్ధతుల్తో కాజేశారు. కొన్ని గ్రామాల్లో గిరిజన స్త్రీలను సైతం మోసపుచ్చి లోబర్చుకున్నారు. గిరిజనులను కూలీలుగా, పాలేర్లుగా బానిస చాకిరీ చేయించుకునేవారు. ఈ నేపథ్యంలో గిరిజనుల భూపోరాటాలకు పశ్చిమ ఏజెన్సీ భూమిక ఏర్పరచింది.
        1995లో బుట్టాయిగూడెం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బూసరాజుపల్లి - పైదవారిగూడెం గిరిజన గ్రామాల భూములపైకి గిరిజనేతర భూస్వాముల నాయకత్వంలో మారణాయుధాలతో దాడి ప్రారంభమైంది. తెలుగుదేశం, కాంగ్రెస్‌కు చెందిన భూస్వాములు 500 మంది పరిసర గ్రామాల గిరిజనేతరులను రెచ్చగొట్టి దాడి చేశారు. మారణాయుధాలతో ఈ చిన్న గిరిజన గూడేలపై దాడి చేయడానికి వస్తున్న మూకల్ని ఆ గ్రామాలకు చెందిన 60 మంది గిరిజనులు తమ విల్లంబులతో ప్రతిఘటించారు. వారిని వీరోచితంగా తరిమివేసి, తమ భూములను రక్షించుకున్నారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే ఓ పెద్ద సంచలనం. మరుసటిరోజు సిపిఎం శాసనసభ్యులు 15 మంది ఈ సంఘటనపై శాసనసభను స్తంభింపజేశారు. గిరిజనులకు, వారి భూమికి రక్షణ కల్పించాలని, 1/70 చట్టం కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనతో ప్రేరణ పొందిన ఏజెన్సీ గిరిజనులు బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలలో అన్యాక్రాంతమైన తమ భూములు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోరాట సంఘంగా ఏజెన్సీ గిరిజన భూపోరాట కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీకి సిపిఎం నేతృత్వం వహించింది.
        బూసరాజుపల్లి భూపోరాటం నిప్పురవ్వ మూడు మండలాలకు ప్రాకింది. గిరిజనుల గ్రామ సభలు పెద్ద ఎత్తున జరిగాయి. 1/70 చట్ట ప్రకారం తమ భూములు స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ ప్రతి గ్రామంలో భూస్వాధీన ఉద్యమాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. రెండేళ్ల కాలంలోనే 50 గ్రామాల్లో 10 వేల ఎకరాలు భూపోరాటాల ద్వారా భూమి స్వాధీనం చేసుకొని, పంటలు పండించడం ప్రారంభించారు.
ఏజెన్సీ ప్రాంతాన్ని జైలుగా మార్చారు
       తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర నిర్బంధంతో గ్రామాలపై పోలీసు బృందాలతో దాడులు చేయించింది. అక్రమ కేసులు బనాయించింది. వందలాదిమంది గిరిజనులను, వారికి ప్రత్యక్షంగా నేతృత్వం వహిస్తున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలను, పోలీసు బృందాలు వేటాడి పట్టుకొని, పోలీసుస్టేషన్‌ల్లో హింసించి, నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి, రాజమండ్రి కేంద్ర కారాగానికి పంపారు. ఈ విధంగా 15 ఏళ్ల కాలం నిర్బంధాలను అధిగమించి, భూపోరాటాలు అప్రతిహతంగా మున్ముందుకు సాగాయి. ప్రభుత్వం వేయి మందిపై వందలాది అక్రమ కేసులు బనాయించి, తీవ్రంగా వేధించింది. 500 మందికి పైగా నెలల తరబడి జైళ్ళలో ఉన్నారు. అయినా ఈ నిర్బంధాన్ని లెక్క చేయకుండా గిరిజనులు పోరాటాల్లో స్వాధీనం చేసుకొన్న భూమిని పోరాటాల్తో కాపాడుకుంటూ సాగు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌కమిటీలు, అధికార బృందాలను పంపించింది. చట్టాలను అమలు చేస్తామని హామీలు ఇచ్చింది. భూరికార్డుల తనిఖీల పేర తతంగం నడిపింది. ఈ హామీలను తుంగలో తొక్కింది. భూపోరాటాన్ని అణచివేయడానికి అక్రమ కేసులు, అరెస్టులను ప్రయోగించింది. అయినా పోరాటాలు ఆగలేదు. స్వాధీనం చేసుకున్న భూమిని రక్షించుకోవడం కోసం నేటికీ గిరిజనులు నిరంతరంగా పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు.
చారిత్రక ఘటనలు
      1995 - 2010 వరకూ 50 గిరిజన గూడేల్లో జరిగిన భూపోరాటాల్లో బూసరాజుపల్లి, తాడితోట, వీరంపాలెం, రెడ్డిగణపవరం, పాకల గూడెం, దిబ్బగూడెం, రమణక్కపేట, జగన్నాథపురం, వింజరం తదితర గ్రామాల్లో పోలీసులను ప్రతిఘటిస్తూ భూపోరాటాలు జరిగాయి. ఈ భూపోరాటాలు గిరిజనుల పోరాట పటిమ, ధైర్య సాహసాలు, పట్టుదలకు గొప్ప చిహ్నాలు. చరిత్రలో చెరిగిపోని గిరిజన భూ ఉద్యమానికి మైలురాళ్ళు.
మలిదశ గిరిజన భూపోరాటాలు
      భూపోరాటంలో స్వాధీనం చేసుకొన్న భూములను రక్షించుకోవడం కోసం 2010 నుంచి గిరిజనులు భూమి పోరాటం, న్యాయ పోరాటం సాగిస్తూ వస్తున్నారు. 2006లో అటవీ రక్షణ చట్టం వచ్చింది. సాంప్రదాయకంగా సాగు చేస్తున్న పోడు భూముల రక్షణకు ఉద్యమం ప్రారంభమైంది. తాత ముత్తాతల కాలం నుండి తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి, హక్కులు కల్పించాలనే ఉద్యమం ప్రారంభమైంది. ఏజెన్సీ భూ ఉద్యమానికి మరింతగా మద్దతు పెరిగింది. భూ ఉద్యమం మరింతగా విస్తరించింది. 25 గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో పోడు భూములకు పట్టాలకోసం ఉద్యమం నిరంతరంగా సాగింది. అక్రమ కేసులను లెక్కచేయకుండా, తమ పోడు భూములను నేటికీ తమ భుక్తంలో ఉంచుకొంటూ గిరిజనులు పోడు వ్యవసాయంలో పంటలు పండిస్తున్నారు.
భూపోరాటం కొనసాగుతోంది   
        నేటికీ 1995లో ప్రారంభమైన భూపోరాటం వివిధ దశలుగా నిరాటంకంగా సాగుతూనే ఉంది. గిరిజనుల హక్కు భుక్తంలో ఉన్న భూములను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చి, గిరిజనులకు, గిరిజనులకు మధ్య ఘర్షణలు పెట్టే వైఖరితో నేటి వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 1/70 చట్టానికి విరుద్ధంగా అక్రమంగా అనుభవిస్తున్న గిరిజనేతర భూస్వాముల భూములను స్వాధీనం చేసుకోకుండా, గిరిజనులు పోరాటాల ద్వారా స్వాధీనం చేసుకొన్న 1/70 భూములను ప్రభుత్వం బలవంతంగా పోలీసు నిర్బంధంతో స్వాధీనం చేసుకుంటోంది. గిరిజనేతర భూస్వాములకు చట్టవిరుద్ధంగా 1/70 భూములకు నష్టపరిహారం పేర అక్రమంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు చెల్లిస్తోంది. గిరిజనులకు ద్రోహం చేస్తోంది. గిరిజనులు పోరాటాల ద్వారా స్వాధీనం చేసుకున్న భూములను సాగు చేసుకుంటూ, వాటిని రక్షించుకోవడం కోసం పోరాటాలు నేటికీ సాగిస్తూ ఉన్నారు.
అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో 1922-24 మధ్య విశాఖ - తూర్పుగోదావరి మన్యంలో జరిగిన పోరాటం ఎజెండాలో ప్రధానమైనది ''దేశానికి స్వాతంత్య్రం - గిరిజనులకు భూమి''. అల్లూరి ఆదర్శంతో, అదే పోరాట ఎజెండాతో నేటి పశ్చిమగోదావరి మన్యం గిరిజనులు భూ ఉద్యమాలను అవిశ్రాంతంగా, అప్రతిహతంగా సాగిస్తూనే ఉన్నారు. అంతిమ విజయం ఆదివాసులదే!
                                    - మంతెన సీతారాం        సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు