- పోలవరం ముంపుపై అధ్యయనాలు చెపుతున్నదిదే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : గోదావరికి నిరుడొచ్చిన వరదల ఉధృతి, సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుపై సమగ్ర సర్వే చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ నిపుణుల నుంచి, నిర్వాసితుల నుంచి వినవస్తోంది. దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) నుంచి కాని, కేంద్ర జలసంఘం (సిడబ్ల్యుసి) నుంచి కాని, ప్రాజెక్టు పనులను తలకెత్తుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాని కనీస స్పందన రావట్లేదు. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి కాంటూర్ లెక్కలనే ప్రామాణికంగా చేసుకొని ముంపు ప్రాంతాలను నిర్ణయిస్తున్నారు. నిర్వాసితుల ఆందోళనలతో లైడార్ సర్వే నిర్వహించగా ప్రాజెక్టు తొలిదశగా చెపుతున్న +41 మీటర్ల కాంటూర్ పరిధిలో గతంలో 123 గ్రామాలుండగా, లైడార్ సర్వే తర్వాత అదనంగా 48 గ్రామాలను కలిపారు. ఈ పరిణామంతో పాత కాంటూరు గణాంకాలు తప్పని తేటతెల్లమైంది. ప్రాజెక్టు రెండవ దశగా చెపుతున్న +45 కాంటూర్‌లో లేని గ్రామాలు సైతం నిరుడొచ్చిన వరదలకు మునిగాయి. సర్వసాధారణ (నేచురల్) వరద ముంపు అని ప్రభుత్వం వాదిస్తోంది. నదికి అడ్డంగా కాఫర్‌డ్యాం కట్టడం వలన వరద నీరు వెనక్కి తన్ని వచ్చిన ముంపు అని, చాలా రోజులు గ్రామాల్లో వరద ప్రభావం ఉందని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితి సమగ్ర సర్వే ఆవశ్యకతను మరింత ముందుకు తెచ్చింది.
- భద్రాచలం బేస్ అంచనాలు
నిరుడొచ్చిన వరదలపై తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యయనం చేసి, పోలవరం బ్యాక్ వాటర్‌పై స్వతంత్ర సంస్థతో సమగ్ర సర్వే చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతూ పిపిఎకి లేఖ రాసింది. గోదావరి వరదలంటే స్ఫురించేది భద్రాచలం. ఉమ్మడి రాష్ట్రం నుంచి గోదావరి వరదల లెక్కలు భద్రాచలం బేస్‌గానే వేశారు. భద్రాచలం టౌన్‌కు అతి సమీపంలోనే పోలవరం కోసం ఎ.పి.లో కలిపిన ఎటపాక, కూనవరం, విఆర్ పురం, చింతూరు విలీన మండలాలున్నాయి. ఆ మండలాలకూ భద్రాచలం వద్ద లెక్కలే నేటికీ ఆధారం. గోదావరికి 1986లో వచ్చిన వరదలు అతిపెద్దవిగా చెపుతారు. అప్పుడు భద్రాచలం వద్ద 55.65 మీటర్ల మట్టం (182.60 అడుగులు) రికార్డయింది. గరిష్టంగా 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు పారింది. నిరుడు అంతకంటే తక్కువ స్థాయి వరదలొచ్చినప్పటికీ 1986 నాటి తీవ్రత కనిపించిందని, పోలవరం బ్యాక్ వాటరే అందుక్కారణమని తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగం అంచనా వేసింది. నిరుడు జులై 9న భద్రాచలం వద్ద 38.71 మీటర్లు (127 అడుగులు) నీటిమట్టం నమోదైంది. అదే నెల 16 మధ్యాహ్నం ఒంటి గంటకు అత్యధికంగా 54.35 మీటర్లు (178.30 అడుగులు) నీటి మట్టం రికార్డయింది. గరిష్టంగా 24.50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, పినపాక మండలాల్లోని 99 గ్రామాలు నీట మునిగాయి. ఈ గ్రామాలన్నీ మన విలీన మండలంలోని గ్రామాల కంటే ఎగువన ఉంటాయి. ఈ నేపథ్యంలో దిగువనున్న ఎపిలో ముంపు తీవ్రత స్థాయిని ఊహించవచ్చు.
- ఐఐటి రూర్కీ స్టడీ
పోలవరం ప్రాజెక్టును తొలుత 36 లక్షల క్యూసెక్కుల వరద సామర్ధ్యంగానే పేర్కొన్నారు. అనంతరం గరిష్ట పరిమితి 50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. సిడబ్ల్యుసి స్టడీ 36 లక్షల మేరకే జరిగింది. భద్రాచలం వద్ద గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక 45.73 మీటర్లు (+150 అడుగులు) రెండవ ప్రమాద హెచ్చరిక 47.15 మీటర్లు (+155 అడుగులు), డేంజర్ లెవల్ 48.77 మీటర్లు (+160 అడుగులు). పోలవరం వద్ద 42.67 మీటర్ల (+140 అడుగులు) వద్ద వరదను నిర్వహిస్తుంటే భద్రాచలం వద్ద 58.32 మీటర్ల (191.35 అడుగులు) లెవెల్‌లో వరద ప్రవాహం ఉంటుంది. భద్రాచలం వద్ద కనిష్ట లోతు +107 అడుగులు (బెడ్ లెవెల్) కాగా పోలవరం నిర్మించాక 135 అడుగుల వద్ద ఎండిడిఎల్ (మినిమం డ్రాడౌన్ లెవెల్) ఉన్నప్పుడు భద్రాచలం వద్ద బెడ్ లెవల్‌పై 28 అడుగుల మట్టం పెరుగుతుంది. అదే పోలవరం వద్ద పూర్తి స్థాయిలో +150 అడుగుల వద్ద ఎండిడిఎల్ ఉంటే భద్రాచలం వద్ద బెడ్ లెవల్‌పై 43 అడుగులు పెరుగుతుంది. ఐఐటి రూర్కీ అంచనా ప్రకారం గోదావరికి 58 లక్షల క్యూసెక్కుల వరదొస్తే శబరి ఎగువనున్న కుంట వద్ద 66.58 మీటర్లు (218.40 అడుగులు) నీరొస్తుంది. సిడబ్ల్యుసి మాత్రం 36 లక్షల క్యూసెక్కులకు 54.92 మీటర్ల (180.15 అడుగులు) వరకే అంచనా వేసింది. గోదావరికి 36 లక్షల క్యూసెక్కుల వరదొస్తే తెలంగాణలో 74 గ్రామాలు మునుగుతాయని సిడబ్ల్యుసి లెక్క. అదే 50 లక్షల క్యూసెక్కులైతే 92 గ్రామాలు మునుగుతాయి. కానీ నిరుడొచ్చిన వరదలకు (24.50 లక్షల క్యూసెక్కులు) ఏకంగా 99 గ్రామాలు మునిగాయని తెలంగాణ ఇరిగేషన్ పిపిఎకి రాసిన లేఖలో పేర్కొంది. ఈ అధ్యయనాల నేపథ్యంలో బ్యాక్‌వాటర్ ముంపు ప్రభావంపై సమగ్ర సర్వే అవసరమని రూఢ అవుతోంది.










