Mar 17,2023 10:44
  • సిఆర్‌డిఏకు రూ.500 కోట్లు
  • తిరుపతి, విశాఖ, కాకినాడకు రూ.50 కోట్ల చొప్పున కేటాయింపు
  • పట్టణాభివృద్ధికి రూ.9239 కోట్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసనసభలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో పట్టణాభివృద్ధి శాఖకు రూ.9239 కోట్లు కేటాయించారు. దీనిలో పట్టణాభివృద్ధికి రూ.5941, మౌలిక వసతుల కోసం రూ.3298 కోట్లు ఖర్చు చేయనున్నారు. దాదాపు 1500 రోజులుగా రాజధాని కోసం రైతులు ఉద్యమిస్తున్నా అమరావతి అభివృద్ధికి సంబంధించి కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. కనీసం రాష్ట్ర రాజధాని అమరావతి పేరును బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. సిఆర్‌డిఏకు రూ.500 కోట్లు కేటాయించారు. భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చిన 25,082 మంది రైతులకు వార్షిక కౌలు నిమిత్తం రూ.240 కోట్లు, రాజధాని ప్రాంతంలో 19,500 మంది భూమి లేని నిరుపేదలకు సామాజిక పింఛన్ల కోసం రూ.87.92 కోట్లు, టిడ్కోలో 2,62,216 ఇళ్ల వద్ద మౌలిక వసతుల కోసం రూ.1300 కోట్లు కేటాయించారు. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల కోసం రూ.500 కోట్లు, రాష్ట్రంలో 123 మునిసిపాలిటీల్లో మౌలికసదుపాయలకు రూ.1046 కోట్లు, చెత్త నిర్వహణ కోసం స్థలాలను కేటాయించేందుకు రూ.250 కోట్లు, నిరుపేదలు, వీధుల్లో సంచరించేవారికి షెల్టర్ల నిర్వహణకు 15 వేల మందికి దీనదయాల్‌ అంత్యోదయ యోజన జాతీయ అర్బన్‌ లైవ్‌ హుడ్‌ మిషన్‌ ద్వారా రూ.120 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో నాలుగు స్మార్టు సిటీల అభివృద్ధికి రూ.300 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీకి రూ.300 కోట్లు, గోదావరి రిజర్వు కన్జర్వేషన్‌ కోసం రూ.5 కోట్లు, తిరుపతి, విశాఖ, కాకినాడ నగరాలకు స్మార్టుసిటీల కింద రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. 1000 ప్రదేశాల్లో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణం కోసం స్వచ్చభారత్‌ ద్వారా రూ. 40 కోట్లు, రాష్ట్రంలో లక్ష లోపు జనాభా కలిగిన మునిసిపాలిటీల్లోని 91 ప్రదేశాల్లో టారులెట్లు నిర్మాణం కోసం రూ.27.74 కోట్లు, భూగర్బ డ్రైనేజీ పథకం ద్వారా 91 మునిసిపాలిటీల్లో స్వచ్చభారత్‌ మిషన్‌ ద్వారా పనులు చేపట్టేందుకు రూ.300 కోట్లు, 26 మునిసిపాలిటీల్లో అమృత్‌ -1 పథకం ద్వారా పనులు చేపట్టేందుకు రూ.10 కోట్లు, అమృత్‌-2 పథకం ద్వారా 123 మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులకు రూ. 480 కోట్లు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.761.53 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఏసియన్‌ ఇన్‌ఫ్రాక్ట్చ్రర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు ద్వారా రూ.410 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ నిధులతో పట్టణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలు, ఇతర పథకాలను చేపట్టనున్నారు. పట్టణాలను సుందరీకరణకు రూ.20.58 కోట్లు కేటాయించారు.