- చివరి త్రైమాసికంలో తగ్గిన వృధ్ధి
- కరోనాకు ముందుతో పోలిస్తే వెనుకబాటే
న్యూఢిల్లీ : దేశం శరవేగంగా వృద్ధి బాటన నడుస్తోందంటూ కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా చేస్తున్న ప్రకటనలకు భిన్నమైన స్థితి ఇది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం స్థూల దేశీయ ఉత్పత్తి (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్-జిడిపి) ఆశించిన స్థాయికి చేరుకోలేదు. 2021-22 సంవత్సరాంతానికి గత ఏడాదితో పోలిస్తే 8.9శాతం జిడిపి వృద్ధి రేటు నమోదవుతుందని జాతీయ గణాంకాల శాఖ అంచనా వేసింది. అయితే, తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 8.7 శాతానికి జిడిపి పరిమితమైంది. దీంతో వృద్ధిరేటుపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు పెట్టుకున్న ఆశలు అడియాసయ్యాయి. గత ఆర్థికసంవత్సరం 6.6 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. దానితో పోలిస్తే ఈ ఏడాది నమోదైన వృద్ధి ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ కరోనా ముందు సంవత్సరాల నాటి స్థితికి ఆర్థిక వ్యవస్థ చేరలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనాకు ముందు 2018-19వ సంవత్సరంలో 140.03 లక్షల కోట్ల రూపాయలు ఉన్న ఆర్థిక వ్యవస్థ 2019-20 నాటికి 145.65 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. కరోనా వ్యాప్తి, ప్రణాళికల్లేని లాక్‌డౌన్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. 2021-22 ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో వృధ్ధి రేటు గణనీయంగా తగ్గింది. మొదటి త్రైమాసికంలో 20.3శాతం, రెండవ త్రైమాసికంలో 8.5శాతం, మూడవ త్రైమాస ికంలో 5.4శాతంగా నమోదైన వృద్ధి రేటు చివరి త్రైమాసికంలో 4.1శాతంగా మాత్రమే నమోదైంది. చివరి మూడు నెలల కాలంలో వృద్థి రేటు తక్కువగా నమోదుకావడానికి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌తో పాటు నిత్యావసర ధరల పెరుగుదల కారణంగా చెబుతున్నారు. ఫలి తంగా ద్రవ్యోల్భణం ముప్పు ముంగిట్లోనే దేశం ఉంది.
జివిఎ ఇలా...
ఆర్థిక వ్యవస్థలో జివిఎ (గ్రాస్ వాల్యూ యాడెడ్) 8.3 శాతం ఉంటుందని అంచనా వేయగా 8.1శాతం మాత్రమే నమోదైంది. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ , ప్రొఫెషనల్ సర్వీసు సెక్టార్లలో గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి 28.8 శాతం, రిషైనరీ ఉత్పత్తులు 9.2 శాతం, ఎరువులు 8.7 శాతం, సిమెంటు 8 శాతం ఉత్పత్తి పెరిగింది. మౌలిక రంగాల్లో 4.7 శాతం, సిమెంటులో 8 శాతం మేర వృద్ధి నమోదైంది.
లెక్కల్లో తకరారు ఇలా..
వాస్తవ వృద్ధి ఇంకా తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. జిడిపి గణన కోసం రూపొందించిన త్రైమాసిక లెక్కల్లో అసంఘటిత రంగాన్ని పరిగణలోకి తీసుకోలేదు. వ్యవసాయరంగానికి సంబంధించిన లెక్కలను కొంత సేకరించినప్పటికీ అదీ అంతంతమాత్రమే! సంఘటిత రంగ వృద్ధితో బాటే అసంఘటిత రంగమూ వృద్ధి చెందుతుందని జిడిపి లెక్కల్లో సాధారణంగా భావిస్తారు. అయితే, గత రెండు సంవత్సరాలుగా ఈ పరిస్థితి లేదు. కరోనా కారణంగా అసంఘటిత రంగం దేశంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. కరోనా నుండి ఉపశమనం లభించిన తరువాత సంఘటిత రంగంలో వృద్ధి కనపడినప్పటికీ అసంఘటిత రంగ పరిస్థితి దానికి భిన్నం. లాక్‌డౌన్‌ల తరువాత ఆర్థికవ్యవస్థను నిదానంగా తెరవడంతో ఇప్పటికీ అసంఘటిత రంగం పూర్తిస్థాయిలో కుదుటపడలేదు. కరోనాకు ముందు 2016వ సంవత్సరం నుండి ఇదే పరిస్థితి ఉంది. హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ తమ మార్కెట్ షేర్ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందని తెలిపింది. చిన్న తరహా పరిశ్రమలకు చెందిన తమ పోటీదారులు పలువురు మార్కెట్ నుండి నిష్క్రమించడం ఈ పరిస్థితికి కారణమని వివరించింది. దేశంలో అసంఘటిత రంగ పరిస్థితికి ఇదొక ఉదాహరణ మాత్రమే! అయితే, జిడిపి లెక్కల్లో మాత్రం సంఘటిత రంగంతో సమానంగా అసంఘటిత రంగంలోనూ వృద్ధిని లెక్కించారు. దీంతో జిడిపి వాస్తవానికన్నా ఎక్కువగా కనిపించింది. ఆర్‌బిఐ ఇటీవల ప్రకటించిన వినియోగదారుల విశ్వాసపు (కన్స్యూమర్ కాన్ఫిడెన్స్) గణాంకాల్లో ఈ విషయం స్పష్టమవుతుంది. 2020 జనవరిలో వినియోగదారుల విశ్వాసం 104 శాతంగా ఉండగా, ఈ ఏడాది తాజాగా ప్రకటించిన లెక్కల్లో ఇది కేవలం 72 శాతం మాత్రమే.










