ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటొక్కటిగా విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్న బిజెపి ప్రభుత్వం మరో దొంగ దెబ్బతీసింది. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి విశాఖ ఉక్కును కట్టబెట్టేందుకు కుట్ర పూనడం దాని నయవంచనలకు మరో తార్కాణం. వైజాగ్ స్టీల్ భాగస్వామ్యంతో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ పరిశ్రమను నెలకొల్పేందుకు పోస్కోకు గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు ఇచ్చేయడం దుర్మార్గం. దేశమంతా కరోనాతో పోరాడుతుంటే బిజెపి అండ్ కో మాత్రం ఈ విపత్తు సమయంలోనే ప్రభుత్వ రంగ సంస్థలను, విమానాశ్రయాలను, ఇతర భారీ పరిశ్రమలను కాజేసే కుట్రలకు పాల్పడుతోంది. స్వదేశీ సంస్థలను, ఉత్పత్తులను ప్రోత్సహిద్దామంటూ ఒకవైపు 'లోకల్..వోకల్' నినాదాలనిస్తూనే మరోవైపు బంగారు గుడ్లు పెట్టే ప్రభుత్వ రంగ స్వదేశీ పరిశ్రమలను విదేశీ బహుళ జాతి సంస్థలకు కట్టబెట్టడం మోడీ సర్కార్ దుర్మార్గాలకు దర్పణం.
విశాఖ ఉక్కు (వైజాగ్ స్టీల్) అనేది ఒట్టి ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే కాదు. ఎందరో మహనీయులు, ఎంతో మంది ప్రజల త్యాగనిరతితో ఆంధ్రుల ఆత్మగౌరవానికి నిలువుటద్దంలా రూపుదాల్చిన మహా కర్మాగారం. దేశంలో అత్యధిక ఉక్కు ఉత్పత్తి అయ్యేది ఇక్కడే. డివిడెండ్ల రూపంలో ప్రతి యేటా కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు అందిస్తున్న నవరత్న కంపెనీల్లో విశాఖ స్టీల్ కూడా ఒకటి. తెలుగు ప్రజల ప్రగతిలో విశాఖ స్టీల్ ఒక మైలురాయి. కార్మికులకు, అధికార యంత్రాంగానికే కాదు స్థానిక ప్రజానీకం జీవనయానం లోనూ విశాఖ ఉక్కు ఒక భాగమైంది. అణువణువూ పోరాట స్ఫూర్తితో జీవం పోసుకున్న ఈ కర్మాగారం తెలుగు ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకుపోయిన మణిహారం.
కలికితురాయి వంటి ఇలాంటి మహోజ్వల సంస్థపై కార్పొరేట్ కన్ను పడకుండా ఉంటుందా? ఉండదు. దశాబ్దాలుగా కార్పొరేట్ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడుతూ వచ్చారు. గతంలో వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల సమయంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగితే ప్రజలు తిరగబడ్డారు. స్థానిక ప్రజానీకం అనుమతి తీసుకోకుండా ప్రయివేటుకు కట్టబెట్టే చర్యలు తీసుకోబోమని అప్పట్లో వారంతా ప్రకటించారు. ఎలాగైనా విశాఖ ఉక్కు కాజేయాలని కంకణం కట్టుకున్న పోస్కో మోడీ సర్కార్ తొలినాళ్ల నుంచే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తూ వచ్చింది. కార్మికలోకం చలో విజయవాడ చేపట్టి ఆ ప్రయత్నాలను ఆపగలిగింది. మోడీ మంత్రివర్గం లోని ఉక్కు శాఖ మంత్రి సైతం ప్రజల అనుమతి లేకుండా ముందుకెళ్లబోమని ప్రకటించారు. కానీ కరోనా విపత్తు సమయంలో పిరికిపంద చర్యలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మోడీ సర్కార్ వంచనకు పాల్పడింది. చీకటి ఒప్పందంతో పోస్కోకు జీ హూజూర్ పలికేసింది. జాయింట్ వెంచర్ పేరుతో ఏకంగా 1170 ఎకరాల విశాఖ స్టీల్ భూములను బదలాయించేందుకు అంగీకరించింది. ఈ చీకటి ఒప్పందం కార్యరూపం దాల్చేందుకు ప్రధానమంత్రి కార్యాలయమే నేతృత్వం వంహించిందన్న కథనాలు నివ్వెరపాటుకు గురి చేసేవే. మోడీ సర్కార్ 'లోకల్..వోకల్' నినాదపు లోగుట్టేంటో దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రయివేటు సంస్థలకు భూములు, వనరులు అవసరమైన ప్రతిసారీ పాలకులు చెప్పే మాట 'పరిసర ప్రాంతాల అభివృద్ధి..స్థానిక యువతకు ఉపాధి'. ఈ మాయ మాటలతో కోట్లాది ఎకరాల భూములను, విలువైన ఖనిజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టినా..కేవలం ప్రయివేటు పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి చెందిన ప్రాంతం ఆసేతుహిమాచలం ఒక్కటీ లేదు. కానీ విశాఖ పరిశ్రమ మూలాన ఉత్తరాంధ్ర రూపురేఖలు అంతకు ముందుకంటే ఎంతో మార్పు చెందాయి. ప్రజల జీవన ప్రమాణాల్లోనూ స్పష్టమైన ప్రగతి కనిపించింది. జనజీవనంతో మమేకమైన ప్రభుత్వ సంస్థను అండదండలందించి అభివృద్ధి చేయాల్సిన పాలకులే ఆయువు తీసేందుకు కత్తి నూరడం హేయం. సొంత గనులుంటే విశాఖ ఉక్కు మరింత దృఢమవుతుందని పదేపదే విన్నవిస్తున్నా పాలకులు చెవికెక్కించుకోలేదు. బహుళ జాతి సంస్థ అయిన పోస్కోకు మాత్రం నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయడానికి మోడీ సర్కార్ అంగీకరించిందంటే ఇంతకంటే ప్రజా ద్రోహముంటుందా? విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్ ..ఇలా అడుగడుగునా రాష్ట్రాన్ని వంచిస్తూ వస్తున్న బిజెపి మోసాలను తెలుగు ప్రజానీకం ఇకనైనా తిప్పికొట్టాలి.
కేరళలో తిరువనంతపురం విమానాశ్రయాన్ని ఆదానీకి కట్టబెట్టే యత్నాలను అక్కడి వామపక్ష ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడమేగాక అఖిల పక్షాన్ని కలుపుకొని కేంద్రంపై పోరుజెండా ఎత్తింది. ఆ స్ఫూర్తితో మన రాష్ట్ర ప్రభుత్వమూ విశాఖ స్టీల్ విషయంలో చొరవ చూపాలి. మనకు జరుగుతున్న మోసంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలి. రాష్ట్రంలో జనసేనతో కలిసి 'స్వదేశీ' ప్రచార యాత్ర చేపడతామన్న బిజెపి నేతలను వైజాగ్ స్టీల్‌ను పోస్కోకు కట్టబెట్టడంపై నిలదీయాలి. విశాఖ ఉక్కును కాపాడుకోవాలి.










