Dec 28,2021 16:47

ఉద్యోగులకు సముచితమైన రీతిలో పిఆర్‌సిని ప్రకటించాలి
రైతాంగ సమస్యలు పరిష్కరించాలి
సిపిఎం మహాసభ తీర్మానం

ప్రజాశక్తిాజక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్‌ (తాడేపల్లి) :విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే యత్నాలను సాగనివ్వబోమని, దీనిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా, ఏ త్యాగానికైనా వెనుకాడేది లేదని సిపిఐ(ఎం) 26 వ రాష్ట్ర మహాభ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ మేరకు మహాసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీంతోబాటు పిఆర్‌సి, సిపిఎస్‌పైన, రైతాంగ సమస్యలపైన మరో రెండు తీర్మానాలను చేసింది. మహాసభ రెండవ రోజు (మంగళవారం) ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సిహెచ్‌.నరసింగరావు, దడాల సుబ్బారావు, వి.కృష్ణయ్య ఆ తీర్మానాలను మీడియాకు విడుదలజేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు పోరాటం సాగిస్తామని, దీనిని రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మార్చుతామని సిహెచ్‌ నర్సింగరావు పేర్కొన్నారు. స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సిహెచ్‌.నరసింగరావు ప్రవేశపెట్టగా గుంటూరు జిల్లా ప్రతినిధి అజరుకుమార్‌ బలపరిచారు ఆ తీర్మానంలో ఇలా పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటు కంపెనీకి అమ్మాలని, 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్‌ సబ్‌కమిటీ నిర్ణయాన్ని అప్పుడే మేం వ్యతిరేకించాం. 315 రోజుల నుంచి రిలేనిరాహార దీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఇంకా కొనసాగుతోంది. బిజెపి మైండ్‌గేమ్‌ ఆడుతోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంటులో బిజెపి నాయకులే దీనిపై ప్రశ్నలు వేయించుకుని సమాధానంగా విశాఖ స్టీల్‌ ప్లాంటును అమ్మేస్తామని, ప్రైవేటీకరణ చేస్తామని పట్టుదలతో ప్రకటనలు చేస్తున్నారు. మేం కూడా అంతకన్నా ఎక్కువ పట్టుదలతో కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తిప్పికొట్టేందుకు పోరాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 స్ట్రాటజిక్‌ ఫెయిల్‌ పరిశ్రమల్లో ఒక శాతం కూడా ఇప్పటి వరకు అమ్మని పరిశ్రమ విశాఖ స్టీల్‌ పరిశ్రమ. ఇది దేశంలోనే ఉత్తమమైన కంపెనీ. రూ.20 వేల కోట్ల టర్నోవర్‌ ప్రతి ఏడాదీ సాలీనా ఉత్పత్తి చేస్తోంది. రూ.44 వేల కోట్లు ఇప్పటి వరకు కేంద్రానికి డివిడెండ్లు, పన్నుల రూపంలో చెల్లించింది. కేంద్రం కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే దీనిలో పెట్టుబడులు పెట్టింది. 1991 నుండి ఒక్క రూపాయి కూడా ఈ పరిశ్రమకు సహాయం అందలేదు. అయినప్పటికీ 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఇది విస్తరించింది. విభజన చట్టంలోని ప్రత్యేకహోదా, కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు, ప్రత్యేక ప్యాకేజీలు, రైల్వేజోన్‌ ఇవేవీ అమలు చేయకపోగా, ఎపికి తలమానికంగా ఉన్న ప్రభుత్వ భారీ పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తామనడం అత్యంత దుర్మార్గం. కేంద్రం మైండ్‌గేమ్‌ ఆడుతూ విశాఖ ఉక్కును అమ్మేశాం లేదా ప్రైవేటీకరణ చేసేశాం అని చెబుతోంది. ఏమీ కాలేదు. వాటాలు అమ్మడానికి సలహాదారుని నియమించారు. ట్రాన్సాక్షన్‌, లీగల్‌ అడ్వైజర్లను కేంద్రం నియమించింది. వారికి 2 నుండి 3 ఏళ్ల వ్యాల్యుయేషన్‌ రిపోర్ట్‌ను విలువ కట్టేందుకు సమయం ఇచ్చారు. వారు విలువ కట్టేందుకు పరిశ్రమలోకి వెళ్లాల్సి ఉంది. కానీ మేం వెళ్లనివ్వలేదు. ఇకమీదట కూడా వెళ్లనిచ్చే ప్రసక్తే లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నాలను అడుగడుగునా అడ్డుకుంటూనే ఉంటాం. వ్యాల్యుయేషన్‌ ప్రక్రియ పూర్తయితే ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌, బిడ్డింగ్‌ పిలవడం అనేవి ఉంటాయి. ఈ ప్రక్రియలను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనియ్యం. కచ్ఛితంగా అడ్డుకుంటాం. రూ.2,64,000 తలసరి ఆదాయం ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉంది. 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేట్ల కోరల్లో చిక్కకుండా అడ్డుకుంటాం. రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సదస్సులు, కోటి సంతకాల సేకరణ చేయాలని తీర్మానం చేశాం. అన్ని జిల్లాలు ఈ విధంగా తీర్మానాలు చేస్తాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల సందర్భంగానూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం' అని అన్నారు.

ఉద్యోగులకు సముచిత రీతిలో పిఆర్‌సి ప్రకటించాలి
పిఆర్‌సిపై ఏర్పాటు చేసిన అశుతోష్‌ మిశ్రా నివేదిక సమర్పించి సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ ప్రభుత్వం పిఆర్‌సిని ప్రకటించలేదని, ఇప్పటికైనా నివేదికను బయటపెట్టి ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని సిపిఎం మహాసభ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని వెంకటేశ్వర్లు ప్రవేశపెట్టగా ప్రతినిధి నూర్‌ మహ్మద్‌ బలపరిచారు. రాష్ట్రంలో 10వ పిఆర్‌సి కాలపరిమితి 2018 జూలైకి పూర్తయిందని, రాష్ట్ర ప్రభుత్వం అశితోష్‌ మిశ్రా ఆధ్వర్యంలో పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేసిందని, దీని అమలుపై ఇంతవరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, వెంటనే ప్రకటించాలి మమాసభ కోరింది. అశితోష్‌ మిశ్రా కమిటీ తన నివేదికను సమర్పించి సంవత్సరం పైగా అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అశితోష్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను బహిరంగ పరచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని కోరింది. అలా కాకుండా చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో అధికారుల కమిటీ వేసి వారి నివేదిక పేరుతో ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌లో సగం ఫిట్‌మెంట్‌ బెనిఫిట్‌గా ఇచ్చేట్లు సిఫార్సు చేయించడం ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టడమేనని, అలాగే ప్రధాన ఉద్యోగ సంఘాలతో చిత్తశుద్ధితో చర్చలు నిర్వహించడం కాకుండా తమకు అనుకూలంగా ఉండేటటువంటి వారితో వివిధ రకాల ప్రకటనలతో గందరగోళాన్ని సృష్టించడం ఉద్యోగుల మనోభావాలను గాయపర్చడమేనని తీర్మానం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఉద్యోగ సంఘాలను, వారి జెఎసిలను చర్చలకు పిలిచి వేతనాలతో పాటు అశితోష్‌ మిశ్రా నివేదికలోని ఇతర అంశాలను కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించి సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని సిపిఎం కోరుతోంది.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు తదితర వివిధ తరగతుల ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించడం ద్వారానే ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య సుహృద్భావం ఏర్పడుతుందని భావిస్తూ ఆందోళనల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పోరాటాన్ని వారి కోర్కెలను సిపిఎం రాష్ట్ర 26వ మహాసభ బలపరించింది.
రైతాంగ సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని మహాసభ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని మర్రాపు సూర్యనారాయణ ప్రవేశపెట్టగా చంద్రశేఖర్‌ బలపరిచారు. రాష్ట్రం నేటికీ వ్యవసాయ రాష్ట్రంగానే ఉందని, 60 శాతం ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారని, రాష్ట్రంలో 80 లక్షల సన్న, చిన్నకారు రైతులు ఉన్నారని ఆ తీర్మానంలో పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, రుణభారం పెరిగిపోతుంది. ఆత్మహత్యలు ఆగడం లేదు, ఈ ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం, వేరుశనగ పంటల గిట్టుబాటు ధర లేక 10 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిందని, వ్యవసాయాన్ని వదిలేవారి సంఖ్య పెరుగుతూ ఉంది.స్వామినాథన్‌ కమిషన్‌ సూచన ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను కొంటామన్నా ఆచరణలో మిల్లర్ల, వ్యాపారుల పెత్తనమే సాగుతోందని తీర్మానం పేర్కొంది. ధరల స్థిరీకరణనిధి లేదు. కంపెనీ వ్యవసాయాన్ని రద్దు చేయాలని కోరింది. సహకార చక్కె ఫ్యాక్టరీలను, డెయిరీలను కాపాడాలని తీర్మానించింది. కేరళ రాష్ట్రం మాదిరి చేసిన రుణమాఫీ చట్టాన్ని అమలు చేయాలని, విత్తన చట్టం చేయాలని తీర్మానంలో పొందుపరిచారు. పంటల బీమా సమగ్రంగా అమలు చేయాలని కోరారు. భూపేంద్రసింగ్‌ హుడా కమిటీ చేసిన సూచనల ప్రకారం .కరువులు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కోల్పోయిన రైతాంగ ఆహార పంటలకు 25 వేలు, వాణిజ్య పంటలకు 50 వేలు ఇవ్వాలని కోరింది.