విద్యార్థుల అభివృద్ధిలో గురువుల పాత్ర కీలకం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి గురువుల పాత్ర చాలా ముఖ్యమని ఆత్మకూరు మండల విద్యాశాఖ అధికారులు ఎస్‌కె నజీర్, చలపతిరావు అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని రెడ్‌క్రాస్ కార్యాలయంలో ప్రాంగణంలో మహమ్మద్ నజీర్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మహమ్మద్ నజీర్‌కు సన్మానం నిర్వహించారు. మహమ్మద్ నజీర్ మండలంలోని కరటంపాడు ఎంపిపిఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులలో ఉద్యోగ విరమణ చేయబోతున్న నజీర్‌కు ఆయన మిత్రబృందం ఆత్మీయ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని మిత్రబృందం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాములు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని అన్నిటికంటే విలువైన వృత్తి ఉపాధ్యాయుడు వృత్తిని కొనియాడారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను అభివృద్ధి చేయడమే కాకుండా గ్రామ అభివృద్ధికి కూడా దోహదపడతారని కొనియాడారు. తల్లిదండ్రుల తర్వాత గురువేనని గురువులను గౌరవించడం అందరి బాధ్యత అని తెలియజేశారు. నజీర్ ఆత్మకూరు మండలం జన విజ్ఞాన వేదిక యుటిఎఫ్ సంఘాలలో కార్యకర్తగా నాయకునిగా సుదీర్ఘకాలం పని చేశాడు. కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు లక్కు కృష్ణ ప్రసాద్, 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్‌రెడ్డి, జెవివి జిల్లా నాయకులు హరికృష్ణ, మురళీకృష్ణ, మల్లికార్జున, నాగేంద్ర వాగాల శ్రీహరి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ సాదిక్ హుస్సేన్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.










