Nov 13,2023 21:31

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  జిల్లాలో విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 17 తేదీ నుంచి కలెక్టరేట్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌ వెంకటేష్‌, పి.రామ్మోహన్‌ తెలిపారు. సోమవారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జూలై 31 నుంచి ఆగస్టు 10 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేసి విద్యారంగ సమస్యలు తెలుసుకున్నామని చెప్పారు. సైకిల్‌ యాత్ర లో గుర్తించిన సమస్యలు పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, జిల్లా అధికార యంత్రాంగానికి వివిధ ఆందోళనల రూపంలో తెలియచేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరినా నేటి వరకు పట్టించుకోలేదన్నారు. విజయ నగరం, రాజాం డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, బొబ్బిలి, కొత్తవలస డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని, సంక్షేమ వసతి గృహాల్లో తాగునీరు,మరుగుదొడ్లు, ప్రహరీ వంటి మౌలిక వసతులు కల్పించాలని, శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేపట్టడం, కొత్త భవనాలు నిర్మించడం చేయాలని, సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నూతన విద్యా విధానం పేరిట పాఠశాలలను కుదించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుతున్నారని తెలిపారు. నాడు-నేడు కింద చేపడుతున్న పాఠశాల భవనాలు పూర్తికాక పోవడంతో చాలా చోట్ల విద్యార్థులు ఇరుకు గదుల్లోనే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఖాళీ టీచర్‌పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిరవధిక దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అప్పటికి అధికారులు, ప్రభుత్వం స్పందించి పరిష్కరించక పోతే 21 తేదిన వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. అనంతరం నిరవధిక దీక్ష పోస్టర్‌ను విడుదల చేశాఉ. సమావేశంలో జిల్లా నాయకులు డి.రాము, సౌమ్య, రమేష్‌ పాల్గొన్నారు.