మత సామరస్యానికి దక్షిణ భారతం పెట్టింది పేరు. నవ్యాంధ్ర ప్రదేశ్ పరమత సహనానికి ప్రతీక. అలాంటి శాంతి ధామంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం బిజెపి తన సహజసిద్ధ ఎజెండాకు తెర తీయడం ఎంతైనా ఆందోళనకరం. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు బిజెపి నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నాయి. ఆ కోవలోనిదే కర్నూలు జిల్లా ఆత్మకూర్ పట్టణంలో శనివారంనాటి బిజెపి శ్రేణుల స్వైర విహారం. ముస్లిం మైనార్టీలు తమ ప్రార్ధనా మందిరాన్ని నిర్మించే సందర్భంలో స్థానిక నియోజకర్గ బిజెపి నేత నాయకత్వంలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. దాడిని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ తరహాలో స్థానిక బిజెపి నాయకుడు కారు పోనిచ్చి పలువురిని గాయపర్చగా నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసుల గాలిలో కాల్పులు, లాఠీఛార్జిలతోగాని పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇప్పటి వరకు ఆత్మకూర్‌కు మత అల్లర్ల చరిత్ర మచ్చుకైనా లేదు. బిజెపి రూపంలో అలాంటి వాతావరణం ఇప్పుడే ఎదురైంది. మతాలు కులాలనే తారతమ్యాలు అంతరాలు లేకుండా సమైక్యంగా జీవిస్తున్న ప్రజల మధ్య బిజెపి చిచ్చు రగిల్చింది. ఘటన జరిగి రెండు రోజులు కావొస్తుండగా కొన్ని కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసింది ప్రభుత్వం. ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులు ఆత్మకూర్‌లో పర్యటించి శాంతి ప్రవచనాలు ఆలపించారంతే.
ఏ గడ్డి కరచైనా దక్షిణాదిలో కాలు మోపాలని కాచుక్కూర్చున్న బిజెపి కన్ను మన రాష్ట్రంపై పడింది. మత ఉద్రిక్తతలతో నానా బీభత్సం సృష్టించి త్రిపురలో బిజెపిని అధికారంలోకి తేవడానికి కీలకంగా వ్యవహరించిన సునీల్ దియోధర్‌కు బిజెపి అధినాయకత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించి ఏం చేయబోతోందో ఇప్పటికే అర్థమైపోయింది. విజయనగరం జిల్లా రామతీర్ధం సహా దేవాలయాలు, విగ్రహాలపై వరుస దాడులు ఎవరి పనో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. అంతర్వేది రథం దహనం, ఒక పథకం ప్రకారం సాధు సంతుల సమీకరణలు ఉండనే ఉన్నాయి. బెజవాడ దుర్గగుడి రథంలో సింహాల మాయం ప్రచారం తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారంపై నానా యాగీ చూశాం. ఇన్ని విచ్ఛిన్నకర ఘటనలకు పాల్పడినా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బిజెపి ఎత్తుగడలను తిప్పికొట్టి ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించారు. అయినా బుద్ధి తెచ్చుకోని ఆ పార్టీ గుంటూరు నగరంలో జిన్నా టవర్‌ను వివాదంలోకి లాగింది. జాతీయోద్యమ కాలం నుండి మతసామరస్యానికి, శాంతికి చారిత్రక చిహ్నంగా నిలిచిన ప్రఖ్యాత జిన్నా టవర్ పేరు మార్చాలని, లేకుంటే కూల్చేస్తామంటూ బిజెపి కయ్యానికి కాలుదువ్వి మత మారణ హోమం సృష్టించాలని చూస్తోంది. ఆత్మకూర్‌లో ఆ పార్టీ కార్యకర్తల వీరంగం రాష్ట్రంలో బిజెపి విద్వేషకాండకు పరాకాష్ట.
రాష్ట్రంలో బిజెపి దుశ్చర్యలపై వైసిపి ప్రభుత్వానిది ఆది నుండి మెతక ధోరణే. మొక్కప్పుడే వంచకపోతే మానయ్యాక వంచడం సాధ్యం కాదన్న నానుడిని ప్రభుత్వం ఒంట బట్టించుకోవడం లేదు. దేవాలయాలపై దాడుల కేసులేమయ్యాయో తెలీదు. పెద్ద కేసులను సైతం సిబిఐకి ఇవ్వడానికి అంగీకరించని సర్కారు అంతర్వేది ఘటనను సిబిఐకి ఇచ్చేసింది. ఇప్పటికీ ఆ కేసు దర్యాప్తు మొదలే కాలేదు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నా, సర్కారు చేతిలో సిబిఐ కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నా దర్యాప్తు ఎందుకు ప్రారంభం కాలేదో తెలీదు. ఆ దన్నుతోనే బిజెపి మరిన్ని దుశ్చర్యలకు పాల్పడుతోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై రెండు కేసులు, నలుగురి అరెస్టులతో ప్రభుత్వం సరిపెడితే చాలదు. బిజెపి మత విద్వేష రాజకీయాలను అందరినీ కలుపుకొని ఐక్యంగా, చైతన్యవంతంగా ఎదుర్కోవాలి. విద్రోహాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రంలో లౌకికతత్వానికి కలుగుతున్న విఘాతాలపై స్పందించి ఖండించాలి. ప్రజాస్వామిక వాదులు, శాంతి కాముకులు గొంతెత్తాలి.










