Dec 22,2022 15:03

గాంధీనగర్‌   :   అగ్రకులానికి చెందిన యువతితో మాట్లాడినందుకు ఓ దళిత వ్యక్తిపై దాడి చేసిన ఘటన గుజరాత్‌లో జరిగింది. డిసెంబర్‌ 11న జరిగిన ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. అల్పేష్‌ పర్మర్‌ (24) డిసెంబర్‌ 11వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్నేహితురాలితో మాట్లాడుతుండగా.. ఏడుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. తమ వీడియోలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అల్పేష్‌తో వాగ్వివాదానికి దిగారు. కులం పేరుతో దూషిస్తూ.. బెల్టులతో  దాడిచేశారు. నడిరోడ్డుపై కాలితో తన్నారు. పోలీసులకు సమాచారమిస్తే చంపేస్తామని బెదిరించారు.  అతని కాళ్లు, వీపు, చేతులపై తీవ్ర గాయాలవడంతో  కుటుంబసభ్యుల ఒత్తిడితో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు వడోదర సూపరింటెండెంట్‌ తెలిపారు.  ఈ ఘటనపై వడ్గామ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే .జిగేష్‌ మేవాని గురువారం ఘాటుగా స్పందించారు.  ఉనా ఘటన జరిగినపుడు ప్రధాని మోడీ ''కావాలంటే నన్ను చంపండి.. కానీ నా దళిత సోదరులకు హాని చేయవద్దు'' అని పేర్కొన్నారని కానీ.. దళితులపై దాడి ఘటనలు  పునరావృతమవుతున్నా.. రాష్ట్ర అధికార యంత్రాంగం స్పందించడం లేదని ట్విటర్‌లో పేర్కొన్నారు.  ఇటీవల  వడోదరలో ఓ దళిత యువకుడిని బహిరంగంగా చావుదెబ్బలు కొట్టారని   అన్నారు. 

 

;