ప్రజాశక్తి - కందుకూరు :స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో నారా చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణలను రుజువు చేయలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెమటలు కక్కుతున్నారని కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. కేవలం రాజకీయ కక్ష తప్ప, అసలు కేసులో పసలేదన్నారు. చంద్రబాబు నాయుడుకి తోడుగా నిలవాలన్న పార్టీ పిలుపుమేరకు కందుకూరు లోని పార్టీ ఆఫీసు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. 7వ రోజు దీక్షలలో వలేటివారిపాలెం మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం, నేతలు దీక్షను ప్రారంభించారు. ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం మరి కొంతమంది నేతలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దీక్షలో కూర్చున్నారు. దీక్ష ముగింపు సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. కొండను తవ్వి చివరికి ఎలుకను కూడా పట్టలేకపోయారని, ఇప్పుడు ఫైబర్ నెట్ విషయంలో బాబు పై నింద మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఎన్నికలు వస్తుండడంతో టీడీపీపై మరోసారి బురదజల్లేందుకు 420 బ్యాచ్ సిద్ధమైందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు, రాష్ట్ర ప్రజలందరూ బాబుకి అండగా నిలిచి కాపాడుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో సీన్ ఎలా ఉండబోతుందో జగన్మోహన్ రెడ్డికి ఈపాటికే అర్థమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో జనం తరిమికొడతారని ముందే గ్రహించి, రాజకీయ కుట్రలతో చంద్రబాబుని, లోకేష్‌ని అక్రమంగా కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని నాగేశ్వరరావు మండిపడ్డారు. జనం పదేపదే మోసపోరని, ఈసారి ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలో ఇప్పటికే నిర్ణయిం చుకు న్నారని తెలిపారు. చివరిగా పార్టీ సీనియర్ నాయకులు వంకాయలపాటి మాల్యాద్రి, నాగేశ్వరావు గారికి, ఇతర నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.










