ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్రంలో వైసిపిని గద్దె దించడమే లక్ష్యమని, జనసేన-తెలుగుదేశం పార్టీ సమన్వయంతోనే అది సాధ్యమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన-తెదేపా జెఎసి రాష్ట్ర సభ్యులు పాలవలస యశస్వి, పిఎసి సభ్యురాలు పడాల అరుణ, జనసేన- తెదేపా విజయనగరం జిల్లా కో ఆర్డినేటర్ లోకం మాధవి అన్నారు. సోమవారం ఆ పార్టీ కార్యాల యంలో జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేసారు. క్షేత్ర స్థాయిలో జనసేన, టిడిపి నాయకులు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. త్వరలోనే ఉమ్మడి మానిఫెస్టో రానుందని, దానిని ప్రతి ఇంటికీ చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలంద రిపైనా ఉందని అన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాలవలస యశస్వి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉమ్మడి కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పడాల అరుణ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో టిడిపి-జనసేన ప్రభుత్వమే ఏర్పడనుందన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. నవరత్నాలపేరిట నయ వంచన చేశారన్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలు అని చెప్పి మరోవైపు అనేక రకాల పన్నుల వేసి దోచుకుంటున్నాడని అన్నారు. సమావేశంలో పార్టీ ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, బొబ్బిలి జనసేన ఇన్‌ఛార్జి గిరిడ అప్పలస్వామి, జనసేన ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మిరాజ్ పాల్గొన్నారు.