Dec 28,2021 15:15

విద్వేశాలను రెచ్చగొట్టే అధికారంలోకి వచ్చారు
సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ప్రజాశక్తి - జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్‌ (తాడేపల్లి) :వైసిపి, టిఆర్‌ఎస్‌ ఒక తానులోని ముక్కలేనని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలకు హాజరైన వీరభద్రం మాట్లాడుతూ, తెలుగు జాతి మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, ఎపిలో వైసిపి అధినేత జగన్‌ అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల సిఎంలు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, నీళ్లు తదితర అంశాలపై తగాదా పడే జగన్‌, కెసిఆర్‌ రాత్రిపూట మాత్రం కలిసి విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. పరస్పరం వాళ్లు చేసుకునే విమర్శలతో ప్రజలే కొట్టుకుంటున్నారన్నారు. ప్రజా వ్యతిరేక శక్తులు, అణిచివేసే శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారి వలలో పడి ఉద్వేగాలకు లోనుకావద్దన్నారు. ఈ విషయంలో సిపిఎం తెలంగాణ, ఎపి రాష్ట్ర కమిటీలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలంతా మళ్లీ ఎర్రజెండా చెంతకు చేరుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఐక్య ఉద్యమాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా కృషి చేస్తోందని తెలిపారు.
వర్గశత్రువుల విషయంలో జాగ్రత్త
దేశంలో వర్గ శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉంటేనే ఐక్యతను కాపాడుకోగలమని వీరభద్రం అన్నారు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే రీతిలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల తదితర అంశాలే ప్రధానమైతే ఆ రెండు రాష్ట్రాల్లో బిజెపి గెలుపు కష్టమని, అందుకే హిందూ - ముస్లిముల మధ్య ఘర్షణలు, భారత్‌, పాకిస్తాన్‌ సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంగానే హరిద్వార్‌, ఢిల్లీలో రెచ్చగొట్టే రీతిలో ప్రసంగాలు చేస్తున్నాయని తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను తేవడంతో ఆ రెండు రాష్ట్రాల్లోని గ్రామాల్లోకి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు, కారకర్తలు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. కేవలం యుపి, పంజాబ్‌లో గెలవడం కోసమే నల్ల చట్టాలను మోడీ రద్దు చేశారే తప్ప మరొకటి కాదన్నారు. వ్యవసాయ చట్టాలు మంచివని, వాటిని రైతులు అర్థం చేసుకోలేకపోయారన్న మోడీ, వాటి లాభాలను వివరిస్తామని చెప్పడం వెనుక ఏ సమయంలోనైనా నల్ల చట్టాలను అమలు చేసే ప్రమాదం పొంచి ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చారన్నారు.
రెట్టించిన ఉత్సాహం..
ఎర్ర జెండా బలహీనపడిందన్న ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో పైకిలేచిన సందర్భాలు అనేకం ఉన్నాయని తమ్మినేని గుర్తు చేశారు. ఎర్ర జెండా 150 ఏళ్ల చరిత్ర చూసుకుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. సోవియట్‌ యూనియన్‌ పతనం అనంతరం తనకు ఎదురులేదని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు భావించారన్నారు. చైనాతోపాటు అనేక దేశాల్లో నేడు కమ్యూనిస్టు పార్టీ బలపడుతోందని తెలిపారు. పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందడంతో, మార్క్సిజం, లెనినిజాన్ని మళ్లీ చదువుకోవాలని, ఎర్రజెండా మార్గాన్ని ఆలోచించాలనే అంశంపై ప్రపంచంలో నేడు చర్చ జరుగుతోందన్నారు. ప్రపంచ దేశాలను నేడు కరోనా, ఒమిక్రాన్‌ భయపెడుతున్నా, కమ్యూనిస్టు దేశాల్లో ఎక్కడా ఈ సమస్య లేదని తెలిపారు. ప్రజల ప్రాణాలే కేంద్రంగా అక్కడి ప్రభుత్వాలు వైద్యాన్ని అందిచాయని అన్నారు. మోడీ చెప్పినట్లు చప్పట్లు, దీపాలేవీ కరోనాను నివారించలేవని, సైన్స్‌ మాత్రమే నివారణ మార్గమని స్పష్టం చేశారు. కరోనా సమయంలో చైనాలో 1.10 కోట్ల జనాభా ఉన్న వూహాన్‌ నగరంలో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించినా ప్రజలెక్కడా ఆకలితో ఇబ్బంది పడలేదన్నారు. దేశంలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని, ఉపాధి కొరవడగా, నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని చెప్పారు. దేశంలోనూ, అమెరికాలోనూ వైద్యానికి డబ్బులే ప్రధానమని, అశాస్త్రీయ విధానాలతో వైద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని వీరభద్రం విమర్శించారు.