Nov 24,2022 21:33

వైసిపి నూతన అధ్యక్షులు

        అనంతపురం ప్రతినిధి : వైసిపి జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు అధికారిక ప్రకటన వెలువడింది. అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పైలా నరసింహ్యను నియమించగా, సత్యసాయి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణను నియమించారు. ఈ ప్రాంత కోఆర్డినేటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగానూ ఉన్నారు. ఇక పార్టీ బాధ్యతలను ఆయన చూడనున్నారు.
ఎన్నికలకు శ్రేణులను సమయత్తం చేయగలరా..?
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ఉన్నాయి. 2024లో సాధారణంగా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ముందస్తుగా వెళ్తే ఇంకా ముందుగానే ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలను వైసిపి కొత్త అధ్యక్షులు ఏ మేరకు సమన్వయం చేయగలరన్నది చూడాల్సి ఉంది. ఇది వరకు అనంతపురం జిల్లాకు వైసిపి అధ్యక్షులుగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉండేవారు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో అధ్యక్షుడిగా కొనసాగలేనంటూ ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి చెప్పి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానం కొత్త అధ్యక్షున్ని నియమించింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పైలా నరసింహయ్యను నియమించారు. జిల్లాలో పైలా నరసింహయ్య ఏ మేరకు నేతలందరినీ సమన్వయం చేయగలరన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటికే ఆయన సొంత ప్రాంతమైన తాడిపత్రి నియోజకవర్గంలోనే అక్కడి ఎమ్మెల్యే పెద్దారెడ్డితో సరైన సఖ్యత లేదని పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. పైలా ప్రారంభంలో వైసిపిలో చేరినప్పటికీ మధ్యలో ఆయన పార్టీని వీడి తిరిగి మళ్లీ వైసిపిలో చేరారు. ఇప్పుడు ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను పార్టీ భుజానపెట్టింది. జిల్లాలో కొద్ది మంది నేతల మధ్య సరైన సమన్వయం లేదు. ఒక్కోసారి బాహాటంగానే ఇవి కనపించాయి. ఇటువంటి సమయంలో సీనియర్‌ నాయకులను కలుపుకుని పార్టీని నడిపించడం పెద్ద సవాల్‌గానే మారనుంది. ఇక సత్యసాయి జిల్లాకు మాజీ మంత్రి శంకర నారాయణకు తిరిగి బాధ్యతలు అప్పగించారు. మంత్రి పదవుల మార్పు సమయంలోనే పదవులు కోల్పోయే వారికి పార్టీ బాధ్యతలిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శంకర నారాయణకు సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. శంకర నారాయణ గతంలోనూ ఉమ్మడి అనంతపురం జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. పార్టీకి విధేయుడిగా, ముఖ్యమంత్రి నమ్మకాన్ని చూరగొనడంతో ఆయన తొలి విడతలోనే మంత్రి పదవి వరించింది. ఆయనకు అధిష్టానం వద్ద మంచి పలుకుబడే ఉందని చెప్పొచ్చు. అయితే నేతల మధ్య సమన్వయం చేసే విషయంలో ఏ మేరకు సఫలీకృతమవుతారన్నది ప్రశ్నార్థకమనే చెప్పాలి. ఇప్పటికే హిందూపురంలో పెద్దఎత్తున విభేదాలు కొనసాగుతున్నాయి. నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇక్బాల్‌ మధ్య ప్రత్యక్ష పోరు సాగుతోంది. శంకర నారాయణకు సొంత నియోజకవర్గం పెనుకొండలోనే కొంత మంది నుంచి అసంతృప్తి ఉంది. ఇతరచోట్ల కూడా ఇదే పరిస్థితులున్నాయి. వీటిని సరిచేసే పార్టీని ఏకతాటిపై నడిపించడం కత్తిమీద సామే అవనుంది.
పెద్దిరెడ్డే కీలకం..
ఉమ్మడి జిల్లాలో వైసిపి అధ్యక్షులిద్దరూ నాయకులు అందరినీ సమన్వయం చేసే పరిస్థితి ఉందా.? లేదా.? అన్న ప్రశ్నలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూపంలో సమాధానం విన్పిస్తోంది. వైసిపిలో సీనియర్‌ నాయకుడు, మంత్రి అయిన పెద్దిరెడ్డి జిల్లాలోని అందరి నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాయకులను సమన్వయం చేసేందుకు రీజనల్‌ కో ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనే అందరూ ఆధారపడాల్సి ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన సీనియర్‌ నాయకుడే కాకుండా పార్టీ అధిష్టానంలో కీలకమైన వ్యక్తుల్లో ఒకరు కావడం చాలా వరకు సమస్యలను పరిష్కరిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.