న్యూఢిల్లీ : 2022-23 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలమ్మ పద్దును పార్లమెంట్ ముందుంచనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 'ట్యాబ్'తో రాష్ట్రపతిని కలిశారు. ఈ ఉదయం తన నివాసం నుంచి నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయానికి నిర్మలమ్మ చేరుకున్నారు. అక్కడ తన బృందంతో సమావేశమైన అనంతరం.. బడ్జెట్ ట్యాబ్‌తో నేరుగా రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం దేశ ప్రథమపౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్ గురించి వివరించారు. అనంతరం అక్కడి నుంచి నిర్మలమ్మ బృందం పార్లమెంట్‌కు చేరుకుంది.
పార్లమెంట్‌లో బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన మరికాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ తర్వాత లోక్‌సభలో నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కరోనా నేపథ్యంలో.. ఈసారి కూడా బడ్జెట్ ప్రసంగం కాగితరహితంగా ఉండనుంది. ఇందుకోసం నిర్మలమ్మ సంప్రదాయ బాహీ ఖాటాను వదిలి స్వదేశీ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు చేరుకుంది. సభ్యులకు బడ్జెట్ సాఫ్ట్‌కాపీలు ఇవ్వనున్నారు. మరోవైపు పరిమిత సంఖ్యలో ముద్రించిన బడ్జెట్ ప్రతులను పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. వీటిని మీడియా సహా మరికొందరికి అందజేయనున్నారు.










