ప్రజాశక్తి-విజయవాడ రూరల్
ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. విజయవాడ రూరల్ మండలం నున్న, పాతపాడు, మంగళాపురం గ్రామాల్లో ఉపాధి హామీ సమస్యలు అధ్యయనం కోసం ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, ప్రజా సంఘాల నాయకులు సోమేశ్వరరావు, రంగారెడ్డి, చినవెంకటరెడ్డి మంగళవారం పని ప్రదేశాల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ ఉదయం ఆరు గంటల నుండి పనిచేస్తున్నా రెండు పూటలా ఫోటో అప్డేట్ పేరుతో 12 గంటల వరకు ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఎండలో గడపవలసి వస్తుందన్నారు. వేతన బకాయిలు చాలా మందికి రావాలని, జనవరి నుండి మే 13 వరకు దాదాపుగా 14 వారాలు బకాయిలు ఉన్నాయని కూలీలు వివరించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి వారం చొప్పున మాత్రమే డబ్బులు అకౌంట్లో పడ్డాయని తెలిపారు. చేసిన పనికి ప్లే స్లిప్ ఇస్తే ఏ వారం ఎంత పడిందో తెలుసుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి రంగమ్మ, విజయలక్ష్మి, ఏసుమ్మ, దుర్గా, భారతి, రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.










