Feb 01,2022 21:28
  • సాదాసీదాగా సాగిన బడ్జెట్‌ ప్రసంగం

న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారితో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే ఎలాంటి కీలకమైన ప్రకటనలు లేకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వచ్చే 25 ఏళ్లకు బ్లూ ప్రింట్‌ ఈ బడ్జెట్‌ అని చెప్పిన ఆమె, ఆ దిశగా ఎలాంటి నిర్దిష్ట ప్రతిపాదనలు చేయలేదు. కరోనా సంక్షోభ సమయంలో పెద్దయెత్తున సంపద పోగేసుకున్నవారిపై పన్నులు వేయకుండా వారిపట్ల ఎక్కడలేని అనురాగాన్ని ఆమె ప్రదర్శించారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారేమోనని ఆశగా ఎదురు చూసిన మధ్య తరగతికి ఆమె మొండిచెయ్యి చూపారు. వరుసగా నాల్గవ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా ఎయిరిండియా ప్రైవేటీకరణను ఏదో గొప్ప విజయమన్నట్లుగా చెప్పారు. ఎయిరిండియా ప్రైవేటీకణ తరువాత లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసిపై ఆమె దృష్టి పడింది. దీనిని కూడా త్వరలో ప్రైవేటీకరిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఎల్‌ఐసి వాటాల విక్రయం ఈ సంస్థ ప్రైవేటీకరణ దిశగా వేసిన తొలి అడుగుగా ఆమె తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. తొలి దశలో ఎన్ని షేర్లు విక్రయించేది వివరాలు తరువాత వెల్లడిస్తామన్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన రక్షణ రంగంలోనూ ప్రైవేటీకరణకు మరింతగా తలుపులు తెరవాలని నిర్ణయించారు. కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే విషయంలో మోడీ ప్రభుత్వ ఆతృతను ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో స్పష్టంగా తెలియజేశారు. పిఎం గతి శక్తికి ఏడు అంశాలు చోదక శక్తిగా ఉంటాయన్నారు. ఇది వంద లక్షల కోట్ల ప్రాజెక్టు అని , రోడ్లు, రైలు రవాణా, మంత్రిత్వ శాఖలతో సహా 16 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించి, మల్టీ లెవెల్‌ కనెక్టివిటీ ద్వారా సరుకులు, ప్రజా రవాణాను సులభతరం చేయడం, సమయం ఆదా అయాఏ్యలా చూడడం ఈ గతి శక్తి లక్ష్యమన్నారు. 5జి వేలం ఈ ఏడాది చివరికల్లా చేపడతామని, 2025 నాటికి అన్ని గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ అనుసంధానిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జిఎస్‌టిలో భారీ పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనడానికి ఒక సంకేతమని ఆమె చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతల గురించి ఆమె మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. పట్టణ ఉపాధి హామీ పథకం అమలు చేయాలన్న డిమాండ్‌పై ఉలుకు పలుకూ లేదు. పైగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ సారి 25వేల కోట్ల రూపాయల మేర నిధుల కోత పెట్టారు. తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో 1500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్‌, ఒకే దేశం ఒకే టివి చానెల్‌ వంటి వాగాడంబర నినాదాలను నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో గుప్పించారు. అయిదు నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టును ఆమె ప్రకటించారు.