Feb 01,2022 23:03
  • రాష్ట్రానికి మళ్లీ మొండి చేయి

ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయి...? ఇది మహాకవి ప్రశ్న! నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ మనుషులను పూర్తిగా విస్మరించింది. కరోనా రక్కసి విజృంభణతో వారు పడిన, పడుతున్న కష్టాలు లెక్కలో లేనివన్నట్లు వ్యవహరించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో కోట్లాది కుటుంబాలను అతలాకుతలం చేసిన ఆ మహమ్మారి ఉనికిని గుర్తించడానికీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సిద్ధపడలేదు. ఫలితం కన్నీళ్లు తుడవాల్సిన చేతులతో అరకొరగా ఉన్న సబ్సిడీలనూ గుంజుకున్నారు. అన్నదాతలు అడిగిన కనీస మద్దతు ధర ఊసులేకపోగా, ఎరువులపై సబ్సిడీని 4,830 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం కోత పెట్టింది. నిరుపేదలకిచ్చే ఆహార సబ్సిడీని 2,86 లక్షల కోట్ల నుండి 2.06 లక్షల కోట్లకు తగ్గించింది. పెట్రో ఉత్పత్తుల ధరల ధాటికి దేశం అతలాకుతలమవుతుంటే 700 కోట్ల రూపాయల సబ్సిడీకి కోత పెట్టింది. బడి పిల్లల మధ్యాహ్నా భోజనాన్ని, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను కూడా వదలని కేంద్రం అదే సమయంలో దేశాన్ని కార్పొరేట్లకు వడ్డించిన విస్తరిగా మార్చింది. విద్య, వైద్యం, వ్యవసాయం నుండి 5జి సాంకేతికత వరకు అంతా ప్రైవేటుకు ఫలహారమైన తరువాత సామాన్యుల గతి ఏమిటి? దేశ భవిష్యత్తు ఏమిటి? తాజా బడ్జెట్‌లోనూ వేతన జీవులకు ఊరట లభించలేదు. ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులకు కేంద్రం సిద్దపడలేదు. పిఎం గతిశక్తి అంటూ గత ఏడాదే ఊదరగొట్టినప్పటికీ ఏడాది పాటు చతికిలపడిన తరువాత మళ్లీ అదేపాటను తాజా బడ్జెట్‌లో వినిపించారు. అయితే, చేసిన కేటాయింపులను పరిశీలిస్తే దేశాన్ని ముందుకు నడిపించే గతీ వ్యక్తం కావడం లేదు. వృధ్ది సాధించే శక్తీ కనిపించడం లేదు. విభజన ప్రక్రియలో తీవ్ర అన్యాయానికి గురైన రాష్ట్రానికి ఈ సారి కూడా మొండి చెయ్యి చూపింది. ప్రత్యేక హోదా నుంచి విశాఖ ఉక్కు వరకు ఏ ఒక్క దానిలోనూ మోడీ ప్రభుత్వ వైఖరి మారలేదు.

 

  • ప్రజానుకూల బడ్జెట్‌ : నరేంద్ర మోడీ, ప్రధాన మంత్రి

ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్‌. ఈ బడ్జెట్‌లో మరినిు సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరిత వృద్ధి, మరిన్ని ఉద్యోగాల కోసం కొత్త అవకాశాలతో నిండి ఉంది. ఇది హరిత ఉద్యోగాల రంగాన్ని కూడా అందుబాట్లోకి తెస్తుంది. ఈ బడ్జెట్‌లో ముఖ్యమైన అంశం పేదల సంక్షేమం. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు సామాన్య ప్రజలకు అనేక కొత్త అవకాశాలు సృష్టిస్తుంది. రోడ్లు, హైవేలు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోంది.

  • గుండు సున్నా బడ్జెట్‌ ఇది : రాహుల్‌, కాంగ్రెస్‌ నాయకులు

మోడీ సర్కార్‌ బడ్జెట్‌ అంతా కూడితే వచ్చేది గుండు సున్నాయే! వేతన జీవులకు ఏమీ లేదు. మధ్యతరగతికీ ఒరిగిందేమీ లేదు. పేదలకు, అణగారిన ప్రజలకు చేసిందేమీ లేదు. యువత, రైతులకూ ఏమీ విదిలించలేదు. ఎంఎస్‌ఎంఇలకూ ఇచ్చిందేమీ లేదు.

  • ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ : సీతారాం ఏచూరి

ఈ బడ్జెట్‌ ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలిగించలేదు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్‌. మహమ్మారి సమయంలో బాగా లాభాలు ఆర్జించిన సంపనులపై పన్నులేయడానికి అడ్డేమిటి? ఉపాధి కోల్పోయి ఆకలి, పేదరికం, ధరలు పెరుగుదలతో ప్రజలు అవస్థలు పడుతున్నా కేంద్రానికి పట్టకపోవడం దారుణం. ధనవంతులపై పనుులేసి, పేదలకు ఉపశమనం కలిగించడంపై ఎటువంటి సమాధానాన్ని ఈ బడ్జెట్‌ ఇవ్వలేకపోయింది. ఉపాధి హామీకి కూడా నిధులు పెంచలేదు.

  • గోల్‌మాల్‌ తప్ప ఏమీ లేదు : కెసిఆర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇది దారుణ బడ్జెట్‌ . గోల్‌మాల్‌ తప్ప ఎవ్వరికీ ఏమీ లేదు. విద్యుత్‌ సంస్కరణలంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్నారు. గ్రామీణ ఉపాధికి, రైతులకు ఇలా అందరికీ కోత పెట్టారు. అమరులైన రైతుల గురించి కనీస ప్రస్తావన లేదు. ఈ ప్రభుత్వం ఎవరి కోసం?

  • ఆశాజనకంగా లేదు : చంద్రబాబు, టిడిపి అధినేత

కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకం లేదు. రైతులు, పేదల కోసం ఏం చేస్తారో చెప్పలేదు. వేతన జీవులకు మొండి చేయి చూపించారు. నదుల అనుసంధాన ప్రణాళికలు బావున్నాయి. డిజిటల్‌, సోలార్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రంగంలో సంస్కరణలు ఆహ్వానిస్తున్నాం. వైసిపి నుంచి 28 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయారు.

  • విభజన హామీల ప్రస్తావనే లేదు : విజయసాయిరెడ్డి, వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత

కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా నిరుత్సాహపరిచింది. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీల ప్రస్తావనే లేదు. ఆర్థిక మంత్రి చెప్పిన సబ్‌ కా వికాస్‌ అసలు లేదు. రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఏ మాత్రం లేదు. కేంద్ర పనుుల్లో రాష్ట్ర వాటా అత్యల్పంగా ఉంది. ఉపాధి హామీ నిధులు ఏ మాత్రం పెంచలేదు. దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఏ ప్రకటనా లేదు. 'పిఎం కిసాన్‌'లో భూమిలేని రైతులను పూర్తిగా వదిలేశారు. ధాన్యం సేకరణకు స్పష్టమైన పాలసీ లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ఎల్‌ఐసి, హెచ్‌పిసిఎల్‌ వంటి లాభాలు గడిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలను కేంద్రం నిర్ణయానిు వ్యతిరేకిస్తున్నాం.

(Also Read : రాష్ట్రానికి మొండి చెయ్యే - అమలుకాని విభజన హామీలు)

  • రాష్ట్రాభివృద్ధిపై దెబ్బ : సిపిఎం రాష్ట్ర కమిటీ

ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు జరపకుండా ద్రోహం చేసిన బిజెపి ఇప్పుడు బడ్జెట్‌ ద్వారా రాష్ట్రాభివృద్ధిని కూడా దెబ్బ కొట్టిందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజా సంపదను బడా కార్పొరేట్‌ కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టే విధానాలనే బడ్జెట్‌లో పేర్కొన్నారని తెలిపింది. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి అన్యాయం జరిగిందని విమర్శించింది.