Union Budget-2022: బూటకం తప్ప మరేం లేదు ! : బడ్జెట్‌పై పెదవి విరిచిన అంగన్వాడీలు
న్యూఢిల్లీ : పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందని, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదని ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్ విమర్శించింది. రెండు లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని చేసిన ప్రకటన బూటకం తప్ప మరేమీ కాదని పేర్కొంది. పోషణ్ 2.0, సాక్షమ్ అంగన్‌వాడీకి బడ్జెట్ కేటాయింపుల్లో పెంపుదల లేదని విమర్శించింది. గత బడ్జెట్‌లో రూ.20,105 కోట్లు కేటాయింపులు వుండగా, ఈసారి చాలా స్వల్పంగా రూ.20,263.07 కోట్లకు పెంచారని, కానీ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాస్తవానికి కేటాయింపులు ఇంకా తగ్గుతాయని విమర్శించింది. బాలల్లో పోషకాహార లోపాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఏడాది కాలంలో ప్రపంచ ఆహార సూచీలో భారత్ స్థానం 94 నుంచి 101కి దిగజారిందని విమర్శించింది. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా చేసిన అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టలేదని విమర్శించింది. 84శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయిన పరిస్థితుల్లో ఆహార సబ్సిడీల కేటాయింపు బాగా తగ్గిపోయిందని, మధ్యాహ్న భోజన పథకానికి కూడా కేటాయింపుల్లో కోత పడిందని విమర్శించింది. బాలల పోషకాహార హక్కులపై దాడి జరిగిన ఈ బడ్జెట్‌ను తీవ్రంగా నిరసిస్తూ ఎన్‌డిఎ ఎంపిలను ఘెరావ్ చేయడంతో సహా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్ పిలుపిచ్చింది. మార్చిలో జరిగే సమ్మెకు సన్నద్ధమవ్వాల్సిందిగా కోరింది.
కార్పొరేట్ అనుకూల బడ్జెట్ : వ్యవసాయ కార్మిక సంఘం
నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఈ బడ్జెట్ పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అనిఅఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం కేంద్ర వర్కింగ్ కమిటీ విమర్శించింది. పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, బాలలు ఇలా అందరూ ఈ బడ్జెట్‌లో నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొంది. పేదలకు అవసరమైన విషయాల్లో కేటాయింపులు తగ్గించి మరోవైపు కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు ఇవ్వాలను మోడీ ప్రభుత్వ ప్రాధాన్యత దీంతో తేటతెల్లమవుతోందని విమర్శించింది.
వికలాంగుల అవసరాలపై స్పందనేది? : ఎన్‌పిఆర్‌డి ఆగ్రహం
వికలాంగుల అవసరాలపై ప్రతిస్పందించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) విమర్శించింది. తమ అవసరాల పట్ల ప్రభుత్వం దృష్టి సారిస్తుందేమోన్న చిన్న ఆశ రాష్ట్రపతి ప్రసంగంతో కలిగిందని, ఆ మరునాడే కేంద్రం తమ ఆశలను పటాపంచలు చేసిందని విమర్శించింది. కరోనాతో కలిగిన అనుభవాల తర్వాత కూడా వికలాంగులందరికీ ఉచిత సార్వజనీన ఆరోగ్య బీమా కల్పించాలను డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఎన్‌పిఆర్‌డి పేర్కొంది.










