Union Budget-2022: ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక బడ్జెట్ : సిపిఎం రాష్ట్ర కమిటీ
- కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపు
విజయవాడ : మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్టు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సిపిఎం పేర్కొంది. ప్రజా సంపదను బడా కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధానాలను ప్రకటించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్‌లో పూర్తి అన్యాయం జరిగిందని ఆగ్రహించారు. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు జరపకుండా ద్రోహం చేసిన బిజెపి, ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రాభివృద్ధిని కూడా దెబ్బ కొట్టిందని తెలిపారు. గతంలో పార్లమెంటులో ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పైసా విధిల్చలేదన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు లాంటి అభివృద్ధి ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కేంద్రీయ విద్యాలయాలకు నిధులివ్వలేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధులు పెంచకపోగా నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇది నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక బడ్జెట్.. విద్రోహ బడ్జెట్ అని మండిపడ్డారు. దీనిపై ప్రజల నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ప్రయివేటీకరణను వేగవంతం చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. జాతీయ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పణంగా అప్పగించడమే ఇది. విశాఖ ఉక్కు కార్మికులు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలంగా పోరాడుతున్నా కనీసం స్పందించడం లేదు. సమర్థవంతంగా నడుస్తున్న ఎల్‌ఐసి ని పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో విచ్చిన్నం చేస్తున్నది. కార్మిక రక్షణ చట్టాలను ఒక్కొక్కటిగా ఉపసంహరించుకున్నది. ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఈజ్‌ఆఫ్ డైయింగ్‌గా దేశాన్ని మార్చేస్తున్నది. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలే దీనికి నిదర్శనం.
గ్రామీణ రైతాంగానికి, పట్టణ కార్మికవర్గానికి, మధ్యతరగతి వేతనజీవులకు ఈ బడ్జెట్ ఏ విధంగానూ ప్రస్తుత సంక్షోభం నుండి ఊరట కల్పించలేకపోయింది. మద్దత్తు ధర చట్టం గురించి ప్రస్తావనే లేదు. రైతులకిచ్చిన హామీలను విస్మరించింది. రైతాంగ ఉద్యమానికి ద్రోహం చేసింది.
ఉపాధిహామీ పథకానికి కేటాయింపులు పెంచవలసింది పోయి తగ్గించడం ఘోరం. ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించి పెరిగే ధరలనుండి సామాన్యులకు ఉపశమనం కలిగించవలసిన తరుణంలో బడ్జెట్‌లో కేటాయింపులకు కోతబెట్టారు. ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమానికి కేటాయింపులు పెరగలేదు. అత్యంత అవశ్యమైన ప్రజారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. విదేశీ ప్రైవేటు విద్యాసంస్థలకు, ఆన్‌లైన్ విద్యా వ్యాపారానికి సదుపాయాలను కల్పించడమే ప్రధానంగా పరిగణిస్తూ, ప్రభుత్వ విద్యావ్యవస్థలను బలోపేతం చేసే బాధ్యతను పూర్తిగా విడిచిపెట్టారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను మరింత వేగంగా అమలు చేస్తామని ప్రకటించారు. రక్షణ రంగంలో, మరీ ముఖ్యంగా పరిశోధన రంగంలో సైతం కార్పొరేట్లకు పెద్దపీట వేశారు.
స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయికి నిరుద్యోగం చేరింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని మోడీ ఎన్నికల్లో ఆర్భాటం చేశారు. కాని ఈ బడ్జెట్ లో రాబోయే అయిదేళ్ళ కాలంలో కేవలం 60 లక్షల ఉద్యోగాలను మాత్రమే కల్పించనున్నట్టు ప్రకటించారు. అవి కూడా వస్తాయన్న నమ్మకం లేదు.
ఈ ప్రజా వ్యతిరేక, రాష్ట్ర వ్యతిరేక కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులన్నీ ఇతర వామపక్ష పార్టీలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాం'' అని అన్నారు.










