Nov 13,2023 21:40

సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి నాయకులు కాంతారావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ను రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని  డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌లో సమ్మె కు సిద్దం కావాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి పిలుపునిచ్చింది. సోమవారం జెఎసి జిల్లా కార్యదర్శి బి.కాంతారావు అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం స్థానిక ఎన్‌ పి అర్‌ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ప్రాజెక్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పిఆర్‌సి అమలు చేయకపోవడం, నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. కనీస వేతనాలు అమలుకు జీవోలు మీదు జీవోలు ఇచ్చినా అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగుల మధ్య విబేధాలు, విభజన సష్టించే విధానాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులో ఒకే క్యాడర్‌ ఉద్యోగులకు రకరకాల వేతనాలు చెల్లిస్తూ, కొత్త విధానాలకు తెరలేపారని, పాత వారికి జీతం పెంచకుండా, కొత్తగా నియమితమైన వారికి జీతం పెంచే సాంప్రదాయాన్ని ప్రారంభించారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని, అన్ని విధాలుగా కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి, ఒక్క సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, అందరిని రెగ్యులర్‌, సమాన పనికి సమాన వేతనం ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు?. జీతాలు పెంచుతున్నట్లు పుకార్లు సృష్టించడం, ఇతర సంఘాలతో ప్రకటన చేయించడం తప్ప, వాస్తవంగా జీతాలు పెంచాలని చిత్తశుద్ధి లేదన్నారు. ఈనేపథ్యంలో త్వరలో అన్ని జిల్లా, రాష్ట్ర కమిటీలు, అన్ని సంఘాలు, ఉద్యోగులతో కలసి సమ్మె నోటీసు ఇచ్చి, డిసెంబర్‌లో సమ్మెకు వెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన తీర్మానాలను సమావేశం ఆమోదించింది. నవంబర్‌ 20న సమ్మె నోటీసు ఇవ్వాలని, 21 నుంచి గడప గడపకు మా బాధలు చెపుదాం పేరిట కార్యక్రమం చేపట్టాలని, డిసెంబర్‌ మొదటి లేదా రెండో వారంలో చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాలని తీర్మానం చేశారు. సమావేశంలో కెజిబివి నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నాయకులు రామకృష్ణ, సునీత, ఆర్ట్‌ క్రాఫ్ట్‌ టీచర్స్‌ యూనియన్‌ నాయకులు రవీంద్రబాబు, కృష్ణం నాయుడు, ఎఎన్‌ఎం అరుణ, జయగణేష్‌ తదితరులు పాల్గొన్నారు.