- రింగ్‌రోడ్డుపై ఏమీ ఖర్చు చేయలేదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కార్యరూపం దాల్చని ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం కట్టుకథలు అల్లుతోందని టిడిపి విమర్శించింది. అసలు వేయని రోడ్డులో రూ.2,400 కోట్ల లబ్ధి జరిగిందనడం రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్న దుష్ప్రచారం అని పేర్కొంది. టిడిపి కార్యాలయంలో బుధవారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వివరించారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అమరావతిని రాజధానిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే.. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ స్వాగతించారని తెలిపారు. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఆలోచన ప్రభుత్వం చేసి చర్చించిందన్నారు. సింగపూర్‌కు చెందిన సుర్భానా జూరాంగ్ తయారుచేసిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం స్టుప్ కన్సల్టెంట్ సంస్థ తయారుచేసిందన్నారు. 75 మీటర్ల వెడల్పుతో 96.25 కిలోమీటర్ల మేరకు అమరావతిలో 27 రోడ్లను కలుపుతూ 87.19 కిలోమీటర్ల రోడ్డును ప్రతిపాదించిందన్నారు. 41 గ్రామాల్లో ఏయే సర్వే నెంబర్ల నుంచి రోడ్డు వెళ్తుందో బహిరంగంగా ప్రచురించారని పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదని సిఆర్‌డిఎ 2023 మేలో సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చిందన్నారు. 2018 సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇవ్వడంతోనే ఆగిపోయిందన్నారు. చంద్రబాబును ఎలాగైనా జైల్లోనే ఉంచాలని అవినీతి జరగని వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. కాగితాల్లో తప్ప కనిపించని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరిగిందని, రూ.2,400 కోట్లు అక్రమంగా లబ్ధి పొందారని ఎసిబి కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఎ షరీఫ్, నాయకులు గద్దె రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.










