- చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చి మళ్లీ అడ్డుకుంటారా
- ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి.. ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు
- ప్రభుత్వ, పోలీసుల తీరుపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం
- నారా లోకేష్ పాదయాత్రకు సన్నద్ధం కావాలి
- బత్తలపల్లి మండల నాయకులకు పరిటాల శ్రీరామ్ పిలుపు
ప్రజాశక్తి-బత్తలపల్లి : టిడిపి అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనంలోకి వస్తుంటే అధికార పార్టీ నాయకులకు వణుకు పుడుతోందని అందుకే వారి పర్యటనలలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై శ్రీరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలన్నారని అయితే అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు పర్యటనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. పైగా పోలీసుల ద్వారా అడ్డుకోవడమే కాకుండా మళ్లీ అక్రమ కేసులు పెడుతున్నారంటూ శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెట్టినంతమాత్రాన టిడిపి శ్రేణులు ఎక్కడా వెనకడుగు వేయరని స్పష్టం చేశారు. వచ్చే నెలలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో బత్తలపల్లి మండల నాయకులతో పరిటాల శ్రీరామ్ సమావేశం నిర్వహించారు. బత్తలపల్లి మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన నాయకులు, కన్వీనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యువ గళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విజయవంతంగా సాగుతోందని ఈ సందర్భంగా శ్రీరామ్ అన్నారు. అన్ని వర్గాల వారితో లోకేష్ మమేకమవుతూ ముందుకు సాగుతున్నారన్నారు. లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి అధికార పార్టీ నాయకులకు భయం పుట్టుకుందని.. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని శ్రీరామ్ అన్నారు. టిడిపి కార్యకర్తలు నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని శ్రీరామ్ స్పష్టం చేశారు. మరి కొన్ని రోజుల్లో పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశిస్తుందని.. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ పాదయాత్రను విజయవంతం చేయడానికి సిద్ధం కావాలని సూచించారు. బత్తలపల్లి మండలంలో ఎక్కడెక్కడ పాదయాత్ర ఉంటే బాగుంటుందన్న దానిపై కార్యకర్తలు నాయకులతో చర్చించారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి చాలా గ్రామాల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. ఒక్కో పంచాయతీలో పాదయాత్ర జరిగినప్పుడు సమీపంలో ఉన్న గ్రామాలన్నీ వచ్చేలా ప్రణాళిక చేయాలని శ్రీరామ్ సూపించారు. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ ఉండాలని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఎక్కువ మంది జనంని కలిస్తే ఆ స్పందన వేరేలా ఉంటుందన్నారు. ఇప్పటి నుంచే పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లపై దృష్టి సారించాలని సూచించారు.










