ఆడపిల్లలకు కుటుంబంలో ఆత్మవిశ్వాసం పెరిగేలా కాకుండా లింగవివక్షను చూపుతున్నారు. అబ్బాయి ఎక్కువ అమ్మాయితక్కువ అనే భావం కలిగిస్తూ ఉండే పెంపకం 'అమ్మాయిల్లో ఆత్మన్యూనతా - అబ్బాయిల్లో అహంకారం 'పెరగడానికి కారణాలు ! పురుషాధిక్య సమాజంలో 'గర్భస్థ శిశువు 'ఆడపిల్ల అని 'ఆమ్నియో సింథసిస్ 'అనే పరీక్షల ద్వారా తెల్సుకుని 'గర్భ విచ్ఛిత్తి 'చేసుకునేవారు, పాప పుట్టిందని బొడ్డూడని ఆడ శిశువును కుప్పతొట్లలో పడేసేవారు ఉన్న సమాజమిది !
గృహసీమ నుండి గగనతలం దాకా పురుషునితోపాటు అన్నిరంగాల్లో ఎదిగి తమ శక్తిసామర్ధ్యాలను ,నైపుణ్యాలను చాటి ''కాదేదీ మహిళకాసాధ్యం !''అని నిరూపించినప్పటికీ మనసమాజంలో 'మహిళలు 'ఇంకా రెండవ తరగతి పౌరులుగానే 'పరిగణింప బడుతున్నారు . 'హలంబట్టి పొలం దున్ని -కలం పట్టి కవితలల్లి -పదంబట్టి పాటలల్లి -గళంవిప్పి పాటపాడి - గజ్జెగట్టి నాట్యమాడి ,తుపాకిబట్టి శత్రుసైన్యాన్ని తరిమి - ఒకటేమిటి , స్త్రీ అడుగిడని రంగమే లేదు . ఒకనాడు ఉపాధ్యాయులుగా ,వైద్యులుగా ,నర్సులుగా కొన్ని రంగాలకే పరిమితమై సేవలందించే మహిళలు ఈరోజు వంటగది నుండి వ్యోమగామి దాకా - కాటికాపరి నుండి కలెక్టరు దాకా కిసాన్ నుండి జవానై ,శాస్త్రసాంకేతిక రంగాల్లో మహిళలు చేస్తున్న ప్రయోగాల ఫలితాలను ప్రపంచం చూస్తూనేవుంది . కానీ 'లింగవివక్ష ' నేటికీ వైరస్‌లా పీడిస్తున్నది! అందుకే ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవ ' ''లింగవివక్షను అధిగమిస్తేనే రేపటి సమాజానికి సుస్థిరత్వం సాధ్యం !'' అనే పిలుపునిచ్చింది.
భారతదేశ సనాతన సంప్రదాయాలు ,సంస్కతీ 'మహిళలను 'పురుషాధిక్యత 'కింద అణచివేసేలా ఉన్నాయి.ఒకనాడు 'మాతస్వామ్య ' సమాజంలో మహిళ ఆదిమ యుగం లో 'స్వయం పోషణ -రక్షణ, గుంపు పోషణ -రక్షణ 'చేయగల సమర్ధురాలు ! గుంపులుగా సంచార జీవనం చేస్తూ తన పేరున గుర్తించబడిన గుంపును రక్షించుకునేది ! ఆహార అన్వేషణ నుండి ఆహారోత్పత్తి దశకు - సంచార జీవనం నుండి స్థిర నివాస జీవితం వచ్చేసరికి గుంపు జీవనం నుండి 'కుటుంబ వ్యవస్థ 'ఏర్పడిన క్రమంలో 'మహిళ సర్వతంత్ర స్వతంత్రత నుండి 'దూరమై గుంపుకు నాయకత్వం నుండి ఇంటిపెద్ద ..., భర్త ,'అధీనురాలై 'పిల్లలకు - పశువులకు 'సంరక్షకురాలిగా 'పరిమితమైంది . ఇంటికే ఆమె అంకితమైంది ! వేదాలు-పురాణాల కాల , మనుధర్మశాస్త్రం 'నస్త్రీ స్వాతంత్య్రమర్హతి .' అని గిరిగీయబడ్డారు . ఇంటి-వంట పనులు -పిల్లలు పెరటి పశువుల పోషణ పరిరక్షణ ధర్మాలకు కట్టుబడసాగింది 'స్త్రీ '! మధ్యయుగంలో ప్రబంధాలకాలంలో 'స్త్రీ ఒక భోగ్యవస్తువు ! ''పురుషులకు సుఖాన్నివ్వడం ,సేవలు జేయడం కోసమే మహిళలు !'' అనేవాదన పెరగసాగింది .ఆమె చుట్టూ 'నిబంధనల ఏర్పాటు ఆమెతో ప్రమేయం లేకుండానే జరిగిపోయేవి !వాటిని పాటించడం మాత్రమే ఆమెకు విద్యుక్త ధర్మంగా విధించబడింది . ''కార్యేషు దాసీ భోజ్యేషు మాతా , కరణేషు మంత్రీ , శయనేషు రంభ ,క్షమయా ధరిత్రీ !'' అనే లక్ష్మణరేఖ గీసి ఆడవారి విధులు నిర్ణయించింది నాటి సమాజం. ఆచారవ్యవహారాలు పేరుతో ఇంటికి పరిమితం చేసి, మహిళా హక్కులు కాలరాయబడ్డాయి. దీనికితోడు, కన్యాశుల్కం, బాల్య వివాహాలు ఆడవారిని ఎదగనీయలేదు . సతీసహగమనం అటు తర్వాత 'నిర్బంధ వైధవ్యం 'మహిళను ఆటబొమ్మను చేశాయి. 'వితంతు పునర్వివాహాలు మహాపాపం' ఆరోజుల్లో ! గురజాడ అప్పారావు, రాజారామ మోహన్ రారు ,కందుకూరి వీరేశలింగం, సావిత్రి బాయిపూలే వంటి వారు చేపట్టిన సంఘ సంస్కరణోద్యమాలు 'నాటి మహిళలకు కాస్త ఊరటనిచ్చాయి !
దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి సంఘ సంస్కరణోద్యమ ఫలితంగా కొత్త వెలుగులకు దారిదొరికింది . మహిళలు కూడా స్వాతంత్య్రోద్యమం లో పాల్గొన్నారు . మహిళలు ఉన్నతవిద్య అభ్యసించడం ,ఉన్నతోద్యోగాలు చేయడం క్రమంగా పెరిగింది . కానీ ,సమాజంలో స్త్రీలను పురుషునితో పాటు, సమానంగా చూడటం మాత్రం ఇంకా ఏరంగం చూసుకున్నా కానరావడంలేదు.
ఆడపిల్లలకు కుటుంబంలో ఆత్మవిశ్వాసం పెరిగేలా కాకుండా లింగవివక్షను చూపుతున్నారు. అబ్బాయి ఎక్కువ అమ్మాయితక్కువ అనే భావం కలిగిస్తూ ఉండే పెంపకం 'అమ్మాయిల్లో ఆత్మన్యూనతా - అబ్బాయిల్లో అహంకారం 'పెరగడానికి కారణాలు ! పురుషాధిక్య సమాజంలో 'గర్భస్థ శిశువు 'ఆడపిల్ల అని 'ఆమ్నియో సింథసిస్ 'అనే పరీక్షల ద్వారా తెల్సుకుని 'గర్భ విచ్ఛిత్తి 'చేసుకునేవారు, పాప పుట్టిందని బొడ్డూడని ఆడ శిశువును కుప్పతొట్లలో పడేసేవారు ఉన్న సమాజమిది ! ఆ గండాలు గడిచి బతికినా ఆడపిల్లపై పసిబిడ్డప్పటి నుండి ఆంక్షలు ! పెంపకంలో వివక్ష ! చదువు,ఆరోగ్యం,వైద్యం కోసం ఖర్చుపెట్టడంలో అమ్మాయి-అబ్బాయి తేడా చూపించడం కూడా 'లింగవివక్ష'లో భాగమే ! అన్నిటినీ ఎదుర్కొంటూ ఇంట్లోంచి బయటపడితే విద్యాలయాల్లో 'ఈవ్ టీజింగ్' ప్రేమోన్మాదుల నుండి భయం ! హాస్టల్ లో సంరక్షణ కరువు ! లేడీస్ హాస్టల్స్ లోకి 'మగాళ్ల రాక' ! ఎంచుకోబడిన అమ్మాయిల శీలం బలి !మానభంగాలు ,హత్యలు ! కేసుల తప్పుద్రోవ పట్టించే వ్యవస్థలు ! ఆయేషా మీరా , రిషితేశ్వరి కేసుల్లా ఏళ్లుగడచినా ,అసలు రేపిస్టులు బయటికి రానీరు ! బడిలో గుడిలో కార్ఖానాల్లో ,వనిలో, గనిలో, బస్టాపులు ,రైల్వే స్టేషన్లలో నడిచే వాహనాల్లో ,రైల్వే కంపార్ట్మెంట్లో ,'లింగవివక్ష 'వలన ఆడ వాళ్లపై అత్యాచారాలు -హత్యలు ! నిర్భయ ,అభయ మనీషావాల్మీకి దుర్ఘటనలు గుర్తుకుతెచ్చి అమ్మాయిలను -ఆడవారిని భయంతో వణికిస్తుంటాయి
కథువా లో ఆసిఫా అనే ఏడేళ్ల బాలికను మందిరంలో దాచి ,మత్తుమందు ఎక్కిస్తూ వారంరోజులపాటు తాత ,కొడుకు-మనవడు వయసులోని మగాళ్లు గ్యాంగ్ రేప్ చేసి చంపి పడేస్తే 'అధికార మతపిచ్చి పార్టీ ఏమిచేసింది? నిందితులలో ఎవరినో అనుమానించిన కారణానో ,వారిని నిర్బంధంలోకి తీసుకున్నారనో 'జాతీయపతాకం 'పట్టుకుని నిరసనప్రదర్శన చేసినవారికిగానీ ,ఆసిఫాబానోను రేపిస్ట్ హంతకులను ఇన్నేళ్ళైనా పట్టుకోలేకపోయిన అరాచకత్వం పడగనీడలో ఉన్నారు ఈదేశపు ఆడవారు !
అంతర్జాతీయ మహిళాదినోత్సవాలు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 1975 నుండి ప్రతి ఏడూ మార్చి 8 జరుగుతూనేవున్నాయి. ఏడాదికి 'ఒక థీమ్ 'తో పనిచేయాలని చెపుతుంటారు . ఇంట్లో గహిణి , ఇంటా బయటా ఉద్యోగిని గా పలు రంగాల్లో నిజాయితీగా విధి నిర్వహణ చేస్తుండే మహిళలకూ 'లింగవివక్ష 'తప్పడం లేదు. విధులను నిర్వహించి ఎట్లాగో ఇల్లుచేరుకుంటే ,'ఇంతాలస్యమేమిటి ?'చూపులతో ప్రశ్నించే భర్త ఆయనతరఫు పెద్దలు ! అదేపని అదే ఆఫీసులో పనిచేసివచ్చే మగ ఉద్యోగి దార్లో టీ -టిఫిన్ -ఫ్రెండ్స్ తో బాతాఖానీ అయి ఇంటికి ఏ ఎనిమిదికో తొమ్మిదింటికో వచ్చినా సరే భార్య ఏమీ అనకుండా ,తినకుండా ఎదురుచూస్తుంటుంది . అదే ఆడ ఉద్యోగైతె ఇంటికి రాంగానే నడుంబిగించి ఇల్లుసర్దుకుంటూ పిల్లలకు ,భర్తకు లేటౌతుందని గబగబా రాత్రివంట, పిల్లలకు స్నానం, హౌమ్ వర్క్ చేయించాలి .తనకు ఓ కప్పు టీ పెట్టిచ్చేవారుండరు కాసేపు 'రిలాక్సయే 'వీలుండదు! లింగవివక్ష ప్రభావం !
ఇంట్లో అమ్మానాన్నల తీరు పిల్లలపై ప్రభావం చూపిస్తుంది .ఎప్పుడూ అబ్బాయికి పనిచెప్పక ,ఆడపిల్లకే పనులు పురమాయిస్తూఉంటే, కూతురికి ఆత్మన్యూనతా భావం ,కొడుకులో 'ఆడపిల్ల పై చులకన 'కల్గి 'నాకేం మగాడ్ని !'అనే భావం బీజం పోసుకుంటుంది . ఇది మొక్కై మొలిచి 'లింగవివక్ష వక్షమౌతుంది '. అందుకే పాతతరం భార్యాభర్తల ఆలోచనల ఫలితాలు చూస్తున్న కొత్తతరం తల్లిదండ్రులు 'ఇంటి నుండే లింగవివక్షను 'తలెత్తకుండా చూడాలి .
రాజకీయాల్లో స్త్రీలపాత్ర నామమాత్రంగానే కొనసాగడం ఏళ్ళకొద్దీ జరగడం తెలిసిందే. స్థానిక సంస్థల్లో సర్పంచులు, మండలపరిషెత్ చైర్మన్లు, కొన్సిలర్లు భర్త-అన్న-తండ్రి కనుసన్నల్లో తమవిధుల నిర్వహించడం 'మహిళా సాధికారత 'కాదు . గెలిచి స్వయం నిర్ణయాలు చేయడం, ఆచరించడం జరిగితేనే 'లింగవివక్ష -పురుషాధిక్యత లేని 'మహిళా సాధికారత 'అవుతుంది .అందుకే స్థానిక సంస్థల్లో గెలుపొందిన మహిళలు ఏపదవిలో ఉంటే ,దానిపై సంపూర్ణ అవగాహన కల్గి, తమ విధినిర్వహణలో మరెవ్వరూ జోక్యంచేసుకోనీయక అన్నీ తెల్సుకుని ఉండాలి.స్వయం నిర్ణయంతో విధినిర్వహణ చేయాలి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఇప్పించేబిల్లు ఇంకా ఆమోదానికి నోచుకోలేదు. '' ముదితల్ నేర్వగరాని విద్యలుండవు.''
లింగవివక్ష 'ను పోగొట్టి ఇంటి నుండి చట్టసభదాకా స్త్రీ లకు పురుషులతో సమానంగా అవకాశాలు పొందేలా రాజ్యాంగంలో సవరణ చేసి 'అన్నిరంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పురుషులతో సమానంగా ఉండేలా రాజ్యాంగ సవరణ చేయబడితే 'లింగవివక్షను 'తప్పకుండా నిర్మూలించే అవకాశముంటుంది ! లెనిన్ చెప్పినట్టు ప్రతి వంటగత్తె ఒక రాజకీయవేత్త కావాలి.
(రచయిత రిటైర్డ్ హెడ్మాస్టర్)
9440757799
చాకలకొండ శారద










