Sep 19,2023 21:23

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

టిడ్కో ఇళ్లకు నీటి సరఫరా అందించాలి
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : మద్దూరుపాడు వద్ద నిర్మించి ఉన్న టిడ్కో ఇళ్లలో నివాసముంటున్న వారికి పూర్తిగా నీటి సరఫరా చేయాలని సిపిఎం నాయకులు మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కు అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ టిడ్కో ఇళ్లల్లో సుమారు 50 కుటుంబాల ప్రజలు నివాసముంటున్నారని వీరికి మున్సిపల్‌ నీటి సరఫరా పూర్తిగా అవ్వడం లేదని తెలిపారు. ఒక సైడు మాత్రం కంటి తుడుపు చర్యగా కొద్దిపాటి నీటి సరఫరా జరుగుతుందని మరో సైడ్‌ మాత్రం పూర్తిగా నీటి సరఫరా జరగడం లేదన్నారు.
దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ట్యాంకర్ల ద్వారా తోలే నీళ్లకు అక్కడ ప్రజలు డ్రమ్ములకు పట్టిన నీళ్లను బిందెలతో రెండు మూడు అంతస్తులు మిద్దెలపైకి తీసుకు పోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇక్కడ చేరిన దగ్గర నుండి ఇదే పరిస్థితి ఉందని, దానివల్ల నీటి సరఫరా లేకపోవడంతో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతున్నారని తెలిపారు. వీరి సమస్యలు మున్సిపల్‌ అధికారులకు పట్టడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని చెబుతూ ప్రచార ఆర్భాటాలు చేస్తుందన్నారు. ఆ ఆర్భాటాలలో పసలేదని అందుకు ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడమే నిదర్శనమని ఈ ప్రభుత్వ పాలన ప్రజలకు అంతగా వరగబెట్టిందేమీ లేదని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా మున్సిపల్‌ కమిషనర్‌ వెంటనే జోక్యం కల్పించుకొని పూర్తిగా నీటి సరఫరాతో పాటు వీధిలైట్లను కూడా ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు వై.కృష్ణమోహన్‌, జి.మధుసూదన్‌ రావు, నాయకులు వి.బాబురావు, బి.కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.