రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత భాషా అకాడమీగా మార్చడం తగని పని. ప్రాథమిక విద్యా బోధనలో సైతం తెలుగు మాధ్యమాన్ని నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తెలుగు అకాడమీని నీరుగార్చుతూ నిర్ణయించడం దారుణం. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల మాతృ భాషలను పరిరక్షించడం, సుసంపన్నం చేయడం ప్రభుత్వ బాధ్యత కాగా ఆ పని మాని తెలుగును బలహీనపర్చే చర్యలకు పాల్పడడం సబబు కాదు. దేశంలో ఎక్కడా రెండు భాషలకు కలిపి ఒక అకాడమీ ఉన్న దాఖలాల్లేవు. మరి ఇక్కడెందుకో !
సంస్కృత భాషను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలుగు సంస్కృత భాషా అకాడమీని నెలకొల్పామని ప్రభుత్వం చెబుతోంది. సంస్కృత భాష అభివృద్ధికి సంబంధించి తిరుపతిలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, సంస్కృత విద్యా పీఠం, ఓరియంటల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, వేద విశ్వవిద్యాలయం, రాష్ట్రంలోని పలుచోట్ల ఓరియంటల్ కళాశాలలు, చాలా విశ్వవిద్యాలయాల్లో సంస్కృత విభాగాలూ ఉన్నాయి. టిటిడి ప్రచురణలు, పరిశోధనా సంస్థల్లోనూ సంస్కృతానికి అగ్రపీఠమే! ప్రాచ్య కళాశాలల్లో సంస్కృతం కోర్సులు బోధించి డిగ్రీలు ప్రదానం చేస్తున్నారు. ఇన్ని ఉండగా సంస్కృతానికి తెలుగు అకాడమీలో భాగమెందుకు? ఏ ఛాందస శక్తుల్ని సంతృప్తి పర్చడానికో ప్రభుత్వం చెప్పాలి. సంస్కృతం మీద సర్కారుకు అంత మక్కువ ఉంటే దాన్ని స్వతంత్రంగా అభివృద్ధి చేయవచ్చు తప్ప అందుకు తెలుగు భాషను బలి పెట్టడం ధర్మం కాదు.
తెలుగు, సంస్కృతం అవిభక్త కవలలు అని కొందరంటున్నారు. మరోవైపు సంస్కృతం నుండి అనేక పదాలు తెలుగులో పుట్టాయంటున్నారు. అప్పుడది మాతృక అవుతుంది. కాబట్టి ఈ వాదనలు పొసిగేవి కాదు. తెలుగు ద్రవిడ భాషా కుటుంబానికి చెందినది. తెలుగులో చాలా పదాలు ద్రవిడ భాషలైన తమిళం, మలయాళం, కన్నడకు దగ్గరగా ఉంటాయి. (రెండు ఇరండుగా, నీరు తన్నీరు..) కాని సంస్కృతానికి వాటిలో చోటు లేనప్పుడు కవలలెలా అవుతాయి? అదే విధంగా తెలుగు భాషలో ఇంగ్లీషు పదాలు అధికంగా ఉన్నాయి కాబట్టి తెలుగు ఇంగ్లీషు అకాడమీగా మార్చేస్తారా? ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ అన్య భాషా పదాలుండడం సహజం. ప్రజలు తమ భావాలు, యోచనలు, అభిప్రాయాలు, వాదనలు వ్యక్తీకరించడానికి మాధ్యమం భాష. సందర్భానుసారం ఆయా భాషల మధ్య ఆదాన ప్రదానాలుంటాయి. భావ వ్యక్తీకరణే భాష పరమావధి కనుక ఆ పదం మూలం ఎక్కడిది అన్నది కాకుండా అర్థం సరైనదా కాదా అన్నదే వాడుకకు ప్రామాణికంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడుతున్న ఇంగ్లీషు భాషలో ఇతర భాషల పదాలు అధికంగా ఉన్నాయి. పర భాషా పదాల్ని ఇముడ్చుకోవడం ద్వారా ఇంగ్లీషు విస్తృతపడిందనీ, సుసంపన్నం అయ్యిందనీ నిపుణులంటారు. భాషాభివృద్ధికి లేదా దాని బలానికి ఆ భాషను ఎంతమంది మాట్లాడుతున్నారన్నదే ప్రాథమిక ప్రాతిపదిక. ఆ రీత్యా చూస్తే సంస్కృతానిది అట్టడుగు స్థానమే కదా !
ప్రభుత్వానికి నిజంగా భాషలను అభివృద్ధి చేయాలన్న సంకల్పమే ఉంటే భాషా పండితులు, లెక్చరర్లు, ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. మూతబడ్డానికి సిద్ధంగావున్న ఓరియంటల్ కాలేజీలను నడిపించాలి. ద్రవిడ విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి కార్యకలాపాలను విస్తృతం చేయాలి. ఇవేవీ చేయకుండా అకాడమీ పేరు మార్చి భాషలను అభివృద్ధి చేస్తామనడం 'అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట' అన్న నానుడిని గుర్తుకు తెస్తోంది. తెలుగును ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. తెలుగు భాషాభివృద్ధికి, విస్తృత పరిశోధనకు అవసరమైన నిధులను కేంద్రం నుండి రాబట్టడానికి కృషి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అకాడమీని నిర్వీర్యం చేసి తెలుగు భాషకు ద్రోహం చేయడం తగదు. ప్రాథమిక విద్య నుండి బోధనా మాధ్యమంగా చేయడంతోపాటు తెలుగు భాష అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలి. తెలుగు అకాడమీ పేరు మార్పు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం విజ్ఞతగా వుంటుంది. సర్కారు ఆ దిశగా యోచించడానికి తెలుగు భాషాభిమానులు, ప్రజాతంత్ర వాదులూ అవసరమైన ఒత్తిడి తేవాలి.










