హైదరాబాద్: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపికచేసే కసరత్తును ఎఐసిసి ప్రారంభించింది. ఇప్పటికే ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. నాలుగు రోజుల పాటు పిసిసి కోర్ కమిటీ సభ్యులతోనూ, పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్న నేతలతోనూ ఠాగూర్ మాట్లాడారు. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయిన ఠాగూర్ మూడు రోజల్లో సమగ్ర నివేదికను రూపొందించి సోనియా గాంధీకి ఇవ్వనున్నారు. అయితే అభిప్రాయ సేకరణలో పిసిసి కోర్ కమిటీలోని ఎక్కువ మంది, శాసనసభ్యుల్లో అత్యధికులు సుదీర్ఘకాలం నుండి పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్లకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క తోపాటు మరికొందరు సీనియర్ నేతలు ఈ వాదనను ముందుకు తెస్తున్నారు. అవసరమైతే మర్రి శశిధర్‌రెడ్డి పేరు కూడా పరిశీలించాలని కోరారు. కాగా పిసిసి ప్రధానకార్యదర్శులు, కోర్ కమిటిలో మిగిలిన వారు, పార్టీ జిల్లా అధ్యక్షులు మాత్రం టిఆర్‌ఎస్, బిజెపిని నిలువరించగల సత్తా ఉన్న నేతకే పదవిని కట్టబెట్టాలని కోరారు. వీరంతా రేవంత్‌రెడ్డి వైపు మొగ్గుచూపారు. మొత్తంగా అభిప్రాయ సేకరణ పూర్తయ్యేసరికి ప్రధానంగా రేవరత్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీలో నిలిచారు.
రేవంత్‌రెడ్డివైపే ఎఐసిసి మొగ్గు?
రాహుల్ గాంధీ కోటరీలో ఉన్న రేవంత్‌రెడ్డివైపే అధికంగా ఎఐసిసి మొగ్గుచూపుతోందని ఢిల్లీలో వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యువతతోపాటు ఇతర ప్రజల్లో ఛారిస్మా ఉన్న నాయకుడు రేవంత్‌రెడ్డి మాత్రమేని అధిష్టానం భావిస్తోంది. దూకుడుగా వ్యవహరించే రేవంత్‌రెడ్డి అయితేనే టిఆర్‌ఎస్, బిజెపి స్పీడ్‌కు కళ్లెం వేయగలడని ఆలోచిస్తోంది. సామాజికవర్గం పరంగా చూసినా రేవంత్‌రెడ్డివైపే మొగ్గు కనిపిస్తోంది. శ్రీధర్‌బాబు పట్ల ఎఐసిసిలో మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ ఆయనకు సామాజిక వర్గంతోపాటు నిధులు సేకరించలేకపోవడం మైనస్‌గా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ నల్గండ జిల్లాలో తప్ప కోమటరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే సత్తా లేదు. పైగా నిధులు సేకరించడంలోగానీ, ఖర్చు చేయడంలో గానీ రేవంత్‌రెడ్డితో పోటీపడే స్థితిలో కోమటరెడ్డి లేడు. స్వంత డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు భారీగా నిధులు సేకరించే సత్తా రేవంత్‌రెడ్డికి మాత్రమే ఉందని ఎఐసిసి నమ్ముతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్, రేవంత్ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఠాకూర్ కూడా రేవంత్ వైపే మొగ్గుచూపుతున్నారు.
సీనియర్లు పార్టీకి గుడ్‌బై చెపుతారా?
రేవంత్‌రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే కొందరు సీనియర్ నేతలు పార్టీని విడిచి వెళతారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి లాంటి నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతారనే వూహాగానాలు సాగుతున్నాయి. వీటిపైన కూడా ఎఐసిసి దృష్టి పెట్టింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్... అభిప్రాయ సేకరణలో భాగంగా పదవి ఎవరికొచ్చినా అందరూ కలిసి పనిచేయాలని చెప్పినట్ల సమాచారం. పార్టీ మారతారనే అనుమానం ఉన్న నాయకులకు పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవులు దక్కుతాయనే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొంతమంది నేతలు రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేయడం ఇష్టం లేక పార్టీ మారతారనే ప్రచారం జరగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి సిద్దంగా ఉంది. కాగా మరోవైపున పిసిసి అధ్యక్ష పదవి దక్కకుంటే రేవంత్ రెడ్డి పార్టీని విడతారనే సమాచారం కూడా ఎఐసిసి దగ్గర ఉంది. అధ్యక్ష పదవి దక్కకుంటే సొంతపార్టీ పెట్టాలని రేవంత్ రెడ్డి ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు సమాచారం.










