ప్రజాశక్తి -పెనుకొండ : నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం క్రాస్ నందు నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ వంశీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఇస్లాపురం క్రాస్ నందు దాదాపుగా 15 ఇళ్లలో గత 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారని అప్పటినుండి నీటి కొరత లేదని అన్నారు. ఇప్పుడు 15 రోజుల నుంచి నీటి సరఫరా లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి నీటిని సరఫరా చేయాలని కోరారు. నేటినుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రమేష్, టిడిపి మైనార్టీ నియోజకవర్గ ప్రెసిడెంట్ రియాజ్, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, సౌమ్య, నాగలక్ష్మమ్మ, జరిన్ తాజ్, తిప్పమ్మ, షబ్బీర్, సత్యక్క, శ్రీనివాసులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.










