ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: జాతీయస్థాయి టైక్వాండో పోటీలలో రాజంపేట క్రీడాకారులు సత్తా చాటారని ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ బి.సునీల్, మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కడప జిల్లా కార్యదర్శి కొన్నిపాటి వెంకటేష్, కోచ్ సి.దామోదర్ రాజు లు పేర్కొన్నారు. ఈనెల 24 25వ తేదీలలో ఒంగోలులోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 25వ జాతీయస్థాయి ఐటిఎఫ్ టైక్వాండో పోటీలలో రాజంపేట కు చెందిన వి.వరుణ్ కుమార్ రజతం, ఎం.యశ్వంత్, ఎం.అలంకృత కాంస్య పతకాలు సాధించినట్లు కోచ్ దామోదర్ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో సోమవారం క్రీడాకారులకు పతకాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం మాస్టర్లు సునీల్, వెంకటేష్, దామోదర్ రాజులు మాట్లాడుతూ రాజంపేట క్రీడాకారులు జాతీయస్థాయిలో పతకాలు సాధించడం హర్షనీయమని అన్నారు. విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకుని మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేశాయని.. విద్యార్థులు క్రీడలలో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించిన మాస్టర్ దామోదర్ రాజును ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఉపాధ్యక్షులు బచోటి భాస్కర్, ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహ, సంయుక్త కార్యదర్శులు అద్దాల మర్రి ఉమాశంకర్, కె.నాగరాజ, కోశాధికారి అయ్యపురాజు చంద్ర, గౌరవ సలహాదారులు వర్ల నరసింహులు, టి.చంద్రశేఖర్, కె.గంగారామ్ లు ప్రత్యేకంగా అభినందించారు.










