Jan 06,2022 07:16

విదేశీ విరాళాలు ఆర్థిక వనరుగా కార్యకలాపాలు సాగిస్తున్న వేలాది స్వచ్ఛంద సంస్థల (ఎన్‌జిఓ) అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, ఇంకొన్నిటిని రెన్యూవల్‌ చేయకపోవడం అమానుషం. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) ప్రకారమే వాటిని రద్దు చేశామని ప్రభుత్వం చెప్పడం బుకాయింపే! ప్రభుత్వ చర్య మూలంగా ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న ప్రజా సేవా కార్యక్రమాలు అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. 2014లో మోడీ గద్దెనెక్కినప్పటి నుండి విదేశీ నిధులతో నిర్వహించే సంస్థలపై సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. పర్యావరణ అంశాలపై పని చేస్తున్న సంస్థలు అణు విద్యుత్‌ ప్లాంట్లు, విష రసాయన పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఒక నివేదికనిచ్చింది. హోం శాఖ పరిధిలో పని చేసే ఐ.బి ఇచ్చిన నివేదిక ప్రాతిపదికగా 2015లో ఏకంగా 9,500 సంస్థల అనుమతులను అదే శాఖ రద్దు చేసింది. ఈ దెబ్బతో అనేక సంస్థలు దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా సాహసించలేకపోయాయి. ఏడాది తిరిగే సరికి అంటే 2016 నవంబరుకల్లా మరో పది వేల సంస్థలకు పైగా అనుమతులు కోల్పోయాయి. ఇది కక్ష గాక ఇంకేమనుకోవాలి?

కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రాణావసర మందుల సరఫరా మొదలు ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు వంటివి చేపట్టిన ఆక్స్‌ఫాం ఇండియా సేవలు ఇప్పుడు కొనసాగలేని దుస్థితి ఏర్పడింది. పర్యావరణ అంశాల్లో కృషి చేస్తున్న గ్రీన్‌పీస్‌ సంస్థ కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసింది. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక భారత్‌లో తమ కార్యలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రముఖ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 2020లోనే ప్రకటించింది. మదర్‌ థెరిసా నిర్వహించిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ పైన కూడా మోడీ సర్కారు వేటు వేయడం తాజా పరిణామం. విదేశీ సంబంధాలున్న సంస్థలు లేదా హిందూయేతర మతాలకు సంబంధించిన సంస్థలను మాత్రమేగాక కాషాయ మూక పట్టు బిగించాలనుకున్న సంస్థలపై కూడా ఎఫ్‌సిఆర్‌ఎ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని విదితమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఎఫ్‌సిఆర్‌ఎ గడువు 2020 డిసెంబరుతో ముగియగా ఘనత వహించిన కేంద్ర హోం శాఖ ఇప్పటికీ రెన్యూవల్‌ చేయలేదు. టిటిడి అధికారులు కనీసం మూడు సార్లు ఢిల్లీ వెళ్లి హోం శాఖ ఉన్నతాధికారుల దర్శనం చేసుకుని వారు అడిగిన వివరాలన్నీ సమర్పించినప్పటికీ ఈ ఏడాదంతా ఎఫ్‌సిఆర్‌ఎ అనుమతి రాలేదు. కోవిడ్‌ కష్ట కాలంలో ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో విదేశీ ఆదాయం వస్తే కొంత ఊరట లభించేదని టిటిడి అధికారులకు ఆవేదన మిగిలిపోయిందితప్ప కేంద్రం మాత్రం కిమ్మనడం లేదు. సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు లోబడి నడుచుకునే టిటిడికి ఒక ఏడాదికిపైగా ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సు రెన్యూవల్‌ చేయకపోవడాన్ని ఏమనుకోవాలి? సంస్కరణల పేరిట ప్రజలపై భారాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం టిటిడిపై పట్టు కోసం ఇలాంటి కిరికిరి కూడా పెడుతోందా అని ఎవరికైనా సందేహం కలగడం సహజం.

మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి పేదలకు, అన్నార్తులకు అవసరమైన సహాయం అందించడం మొదలు అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో సహాయం చేయడం వరకూ స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల్లో ఉన్నాయి. అనేక సంస్థలకు పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశంగా ఉంది. స్వచ్ఛంద సంస్థల సాధారణ స్వభావం సహాయపడడమే! తప్పుడు పనులు చేసేవారుంటే వారిని నిలువరించడాన్ని, అవసరమైతే శిక్షించడాన్నీ ఎవరూ తప్పుబట్టరు. కాని, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ శక్తులకు సహాయపడే సంస్థలను మాత్రమే అనుమతిస్తాం. లేనివాటికి విదేశీ విరాళాలు రానివ్వం అనే విధంగా మోడీ సర్కారు వ్యవహరించడం దారుణం. ప్రజా సేవకు, సమాజ హితానికీ అంకితమై పని చేసే ఏ స్వచ్ఛంద సంస్థకైనా ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనల పేరిట ఆటంకాలు కల్పించరాదు...వాటిని వేధించరాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడం అవసరం.