Nov 24,2022 21:30

సస్పెండ్‌కు గురైన ఉపాధ్యాయుడు ఆదినారాయణ

       హిందూపురం : 'పాఠాలు సరిగా బోధించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారు... పాఠశాలకు రాకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మనం చూసి ఉంటాం. ఇలాంటి వాటికి విరుద్ధంగా సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారులు వ్యవహరించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి ఫేస్‌యాప్‌ ఆన్‌లైన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించమన్నందుకు ఏకంగా ఆ ఉపాధ్యాయున్ని సస్పెండ్‌ చేసి ప్రభుత్వంపై వారికున్న స్వామిభక్తిని చాటుకున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించమని కోరడమే ఆయన చేసిన నేరం అయినట్లు అతనిపై కక్షగట్టి చర్యలు తీసుకున్నారు. ఈ సస్పెన్షన్‌ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... హిందూపురం పురపాలక సంఘం పరిధిలోని మేళాపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎల్‌ఎన్‌.ఆదినారాయణ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన మొక్కు తీర్చుకోవడం కోసం తిరుపతికి వెళ్లాడు. ఈ సమయంలో తలనీలాలు సమర్పించాడు. తిరిగి పాఠశాలకు గుండుతో వచ్చారు. గుండుతో వచ్చిన ఆయన హాజరును పాఠశాల ఫేషియల్‌ యాప్‌(ముఖహాజరు)లో నమోదు కాలేదు. ముఖహాజరు ప్రారంభ నమోదు సమయంలో ఆయన తలకు వెంట్రకలు, మూతిపై మీసాలు ఉన్నాయి. తిరుపతి వెళ్లొచ్చిన తరువాత జుట్టు, మీసం లేని కారణంగా ముఖహాజరు నమోదు కాలేదు. ఈ విషయాన్ని సదురు ఉపాధ్యాయుడు ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుని ప్రమేయం లేకుండానే ఈ విషయం పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యింది. దీనిపై విద్యాశాఖ అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు చేసిన ఈ పని నేరం అన్నట్లుగా భావించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 17వ తేదీన ఉపాధ్యాయుడికి జిల్లా విద్యాశాఖ అధికారులు మెమో జారీ చేసి, వివరణ కోరారు. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయుడు ఎంఇఒ ద్వారా వివరణ పంపాడు. కాగ ఈ వివరణ సరిగా లేదంటూ జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి గురువారం నాడు ఉపాధ్యాయుడు ఆదినారాయణను ఏకంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. యాప్‌లోని లోపాలను సరిచేయమన్నందుకు సస్పెండ్‌ చేయడం ఏమిటంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణం ఆయన సస్పెన్షన్‌ను ఎత్తేయాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని తెలియజేశారు.
అధికారుల ఒత్తిడి మేరకే సస్పెండ్‌ నిర్ణయం : డిఇఒ మీనాక్షి
హిందూపురం పురపాలక సంఘం మేళాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఆదినారాయణను అధికారుల ఒత్తిడి మేరకే సస్పెండ్‌ చేశామంటూ డిఇఒ పాత్రికేయుల ఎదుట పేర్కొన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మేళాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదినారాయణ అనే ఉపాధ్యాయున్ని ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకే సస్పెండ్‌ చేశామన్నారు. ఫేస్‌ యాప్‌ రిజిస్టర్‌లో సాంకేతికలోపాలు కొన్ని ఉన్న మాట వాస్తవమే అన్నారు. అయితే ఈ అంశాన్ని ఉపాధ్యాయుడు బహిర్గతం చేయడం, ఆ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. ఉపాధ్యాయుడు ముఖహాజరు పడని రోజు ఎటువంటి సాంకేతిక లోపం లేదన్నారు. ఫోన్‌లో నెట్‌వర్క్‌ సమస్య రావాడం వల్ల ఇలా జరిగి ఉండొచన్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడం సరైన పద్ధతి కాదని భావించిన ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారన్నారు.