బహుళ ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పటికీ, 2021లో మొదటిసారిగా భారతదేశ తలసరి జిడిపి బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకే ఉంది. దీనికి మొత్తం లాక్‌డౌన్ ను కారణంగా చెప్పవచ్చా? లేక పెద్ద నోట్ల రద్దు లాంటి చర్యలు 2016 లోనే ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితిలోకి నెట్టాయా?
ప్రముఖ కాలమిస్ట్, 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' భారత అధ్యక్షుడు ఆకార్ పటేల్... ఫ్రంట్‌లైన్ ప్రతినిధి జియా ఉస్సలామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లోని కొన్ని ముఖ్యాంశాలు...
ఇక్కడ జాతీయ లాక్‌డౌన్ ను కారణంగా చెప్పలేం. 2014లో బంగ్లాదేశ్ తలసరి జిడిపి భారతదేశం కంటే 50 శాతం వెనుకబడి ఉంది. మోడీ పాలనా కాలంలో బంగ్లాదేశ్ భారత్ ను చేరుకోగా, భారత దేశం ఆర్థికంగా తన మార్గాన్ని కోల్పోయింది. బంగ్లాదేశ్ సరుకులు ఎగుమతిలో, వస్త్రాల తయారీలో లక్షలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. వస్త్ర ఉత్పత్తిపై ఆ ప్రభుత్వం బాగా కేంద్రీకరించింది.
మరోవైపు, మోడీ దేశ ప్రధాని కావడానికి ముందు నుంచే ఐదు కోట్ల మంది భారతీయులు పని చేస్తున్నారు. అమెరికాలో శ్రామిక శక్తి భాగస్వామ్యం 60 శాతం, చైనాలో 70 శాతంగా ఉంటే, నేడు భారత దేశంలో కేవలం 40 శాతం మాత్రమే ఉంది. ఇది పాకిస్థాన్ శ్రామిక శక్తి కంటే తక్కువ. మొదటిసారిగా దక్షిణాసియా లోనే ఇది అత్యంత తక్కువ శ్రామిక శక్తిగా నమోదైంది. మోడీ, భారతదేశ శ్రామిక శక్తిని ఐదవ వంతుకు తగ్గించాడు. ఇవి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే కాబట్టి వీటిలో ఎటువంటి వివాదానికి తావుండదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ప్రస్తుతం పని చేస్తున్న వారికి నాలుగింతల మంది 2013లో ఉండేవారు. కాబట్టి భారతీయులకు పని కావాలి కానీ పని లేదు. ఫలితంగా అపారమైన నష్టం జరుగుతుంది. 2012లో కంటే 2018లో భారతీయులు తక్కువ ఖర్చు చేస్తూ, తక్కువ తింటున్నారు. ఒక ప్రభుత్వ సర్వే ప్రకారం, పదవీ విరమణ చేయబోతున్న ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఆ సర్వే విడుదల చేయాలని కోరారు కానీ భయంతో మన ప్రధాని దానిని దాచి ఉంచారు.
దశాబ్దాల ప్రగతిని తారుమారు చేస్తూ, 2020లో 23 కోట్ల మంది ప్రజలు పేదలుగా మారారు. 800 మిలియన్ల మంది నేడు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న పప్పులు, ధాన్యాలపై ఆధారపడుతున్నారు.
ఆఖరికి మోడీని ఆరాధించే మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కూడా ఆగిపోయింది. పది సంవత్సరాలుగా, ప్రతీ సంవత్సరం అమ్మకానికి పెట్టిన కార్లు, గృహ ఆస్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. దిగువ మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కూడా నిలిచిపోయింది. ఐదు సంవత్సరాల కాలంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల సంఖ్య, 15 సంవత్సరాలగా త్రిచక్ర వాహనాల అమ్మకాల సంఖ్య పూర్తిగా పడిపోయింది. మనం తిరోగమన దిశలో ఉంటున్నాం. ఒకవేళ మనం అంతా బాగానే ఉందనుకుంటే, సరిచేయడానికి ఏమీ ఉండదు. ప్రధానమంత్రికి వాస్తవాలు తెలుసో లేదో గానీ, అంతా బాగుందంటున్నారు. కానీ అది వాస్తవం కాదు.
ఏ దేశం తన కరెన్సీని రద్దు చేయడం ద్వారా అవినీతిని అరికట్టలేదు. ఆర్బీఐ కూడా పెద్ద నోట్ల రద్దు గురించి మోడీని హెచ్చరించింది. అయినా ఆయన ఎందుకు తన నిర్ణయాన్ని అమలు చేశారు? స్వయంకృతాపరాధం వల్ల కలిగిన నష్టం నుండి మనం కోలుకున్నామా?
మోడీ చాలా నిష్కర్షగా ఉంటానని చెపుతారు, కానీ ఆయనకు వివరాలు తెలియదు. ఆయన తన దగ్గరకొచ్చిన ఫైళ్ళను చదవరు. మౌఖికంగా చెప్పిన విషయాలను రెండు నిమిషాల్లో విని, చర్యలకు నిర్ణయం తీసుకుంటామని చెపుతారు. దేశాన్ని పాలించే విధానం ఇది కాదు. కానీ ఇదే ఆయన పద్ధతి. ఇది ఆయనకు సౌకర్యంగా ఉందని అంటారు.
ఆయనొక శక్తివంతమైన నాయకుడు. ఆయన తప్పు చేస్తున్నారని చెప్పేవారెవరూ లేరు. అవినీతిని, నల్ల ధనాన్ని, తీవ్రవాదాన్ని అంతమొందించడానికి పెద్ద నోట్ల రద్దే చాలా తేలికైన పరిష్కారమని ఆయన నమ్మారు. ఆయన ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు దాని వల్ల కలిగే దుష్ఫలితాలను పరిగణ లోకి తీసుకోకపోవడం వలన కల్లోల పరిస్థితులు, దురవస్థలు ఏర్పడి, ఆ నిర్ణయం వైఫల్యం చెందినపుడు భంగపడ్డారు. నవంబర్ 8 సమావేశానికి మంత్రులందరూ ఫోన్లు లేకుండా హాజరవ్వాలని చెప్పడమంటే దానర్థం, మంత్రులెవ్వరికీ ఏం జరుగుతుందనే విషయం తెలియదు. నోట్ల రద్దు గురించి కూడా తెలియదు. అంటే ముందస్తు ఏర్పాట్లు లేవు. మనం కోలుకున్నామా లేదా కోలుకుంటామా చెప్పడం కష్టం.
రాజకీయ నాయకులు ఉపయోగించే ''మేకిన్ ఇండియా'', ''డిజిటల్ ఇండియా'', ''ఆత్మ నిర్భర్ భారత్'', ''బేటీ బచావో బేటీ పఢావో'' లాంటి పదాల ఫలితాలు క్షేత్ర స్థాయిలో ఎలా ఉన్నాయి?
స్థూల దేశీయ ఉత్పత్తిలో వస్తు ఉత్పాదక భాగం, ''మేకిన్ ఇండియా'' ప్రారంభించిన తరువాత 16 శాతం నుంచి నేడు 13 కంటే తక్కువ శాతానికి పడిపోయింది. 2016 తరువాత వస్తు ఉత్పాదక రంగంలో మొత్తం ఉద్యోగాలు 5.1 కోట్ల నుండి సగానికి అంటే 2.7 కోట్లకు పడిపోయాయి. ప్రధానమంత్రి పూర్వ సలహాదారు అరవింద్ పనగారియా, ఆత్మ నిర్భర్ భారత్ గందర గోళంగా ఉందని అన్నారు. భారతీయ వినియోగదారునికి వస్తువు లను ఎక్కువ ఖరీదుకు అందజేసి, బయటి పోటీ నుంచి ధనిక వ్యాపారస్తులను కాపాడటం దాని ప్రాథమిక కర్తవ్యంగా ఉంది.
శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది.''మేకిన్ ఇండియా'', యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మాన్యుఫాక్చరింగ్ పాలసీకి అనుకరణ. ఆఖరికి లక్ష్యాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి. అదనంగా లోగోను చేర్చారంతే. అది మోడీ పని తీరును తెలియజేస్తుంది.
నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఎక్కువగా ఉన్నపుడు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్ట నిర్వహణను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది?
ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని బయటకు చెప్పకుండా గుర్తించే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంది. మోడీకి ఉద్యోగాలను సృష్టించగలనన్న విశ్వాసం ఉండేది. అందువల్ల ఆయన ప్రారంభంలో ఆ పథకానికి నిధులను కుదించి, దానిని ఎగతాళి చేశారు.
ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం మొదలైనప్పుడు, 2014లో ఆ పథకానికి చేసిన ఖర్చు 32 వేల కోట్ల నుండి 2018లో 61 వేల కోట్లకు రెట్టింపై, 2020లో మూడింతలు అంటే 1,11,000 కోట్లకు పెరిగింది. ఈ సంవత్సరం కేటాయించిన నిధులు మొదటి ఏడు నెలల్లోనే ఖర్చయ్యాయి.
ప్రధానమంత్రి ఆవాజ్ యోజన (పీఎంఏవై), 2022 నాటికి రెండు కోట్ల ఇళ్ళను నిర్మించాలనే లక్ష్యంతో ఉంది. ఆ లక్ష్యానికి అది చేరువలో ఉందా, లేక పెద్ద నోట్ల రద్దు విషయంలో వలె, ఆ లక్ష్యంలో కూడా ఏవైనా మార్పులు ఉంటాయా?
వాస్తవానికి ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాలు చెయ్యదు. అది నాలుగు భిన్నమైన భాగాల కింద నిధులు ఇస్తుంది. వాటిలో ప్రధానమైనది, ఇళ్ళను నిర్మించుకునే వారికి లేక ఇళ్ళను విస్తరణ చేపట్టిన వారికి ప్రత్యక్షంగా సహాయం చేస్తుంది. దీనికి భూమిపై యాజమాన్య రుజువు ధ్రువీకరణ అవసరం. ఇతర అన్ని పథకాల వలె పీఎంఏవై కూడా పూర్వం ఉన్న పథకానికి పేరు మార్చుతుంది. ఇతర పథకాల వలె ఈ పథకం కూడా భారతదేశంలో పాలనాపరమైన ఇబ్బందుల లాంటి వాటినే ఎదుర్కొంటుంది. మంజూరు చేసిన దానికంటే కేంద్రం చెల్లించేది చాలా తక్కువగా ఉంటుంది. పీఎంఏవై మొదటి నాలుగేళ్లలో రూ. 2 లక్ష కోట్లు మంజూరు చేసి, కేవలం రూ. 20 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
చివరగా, మోడీ పాలనలో భారతదేశం చెల్లిస్తున్న మూల్యం ఏమిటి?
ఒకటి, ఆర్థికంగా భారతదేశం చైనా తరువాత దేశంగా ఉండే మార్గంలో లేదు. మోడీ పాలనలో, ఆర్థిక వ్యవస్థ భారీగా పేదరికాన్ని కొనసాగించే, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను సృష్టించే మార్గంలో ఉంది. ఇప్పడున్న విధంగా, కొద్దిమందే మెజారిటీ వనరులు, సంపదను అదుపు చేస్తారు.
రెండోది, సమాజానికి సంబంధించినది. మనం విభజించబడతాం. మైనారిటీలు బలవంతంగా ప్రత్యేక ప్రాంతాల్లో ఉంటారు. ప్రజల మనసులు మతపరమైన విభేదాలతో, వారి చిహ్నాలతో ఆవహించి ఉంటూ, హింసను కూడా అంగీకరిస్తారు. న్యాయ వ్యవస్థ భయంతో తన బాధ్యతను విస్మరిస్తుంటే, మోడీ హిందూత్వ శక్తులు చట్టబద్ధమైన అధికార బదిలీ కోసం ప్రోత్సహిస్తున్నాయి. నేడు హిందూత్వ అల్లరి మూకలు భారతదేశాన్నేలుతూ, భవిష్యత్తులో తామనుకున్నది జరగాలని కోరుకుంటున్నాయి.
(''ఫ్రంట్‌లైన్'' సౌజన్యంతో)










