Dec 28,2021 17:14

రైతు కమిషన్‌కు అధికారాలివ్వాలి
సిపిఎం మహాసభ తీర్మానం

ప్రజాశక్తి-జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్‌ (తాడేపల్లి) :రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, తక్షణమే రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర 26వ మహాసభ కోరింది. ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ వివరాలను గుంటూరుజిల్లా, తాడేపల్లిలోని టి షడ్రక్‌, రెడ్డి శ్రీరామ్మూర్తి ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి కృష్ణయ్య మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ ''ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు 10లక్షల ఎకరాల పంట దెబ్బతింది. మిర్చి, పత్తి పంటలు 90శాతం నాశనం అయ్యాయి. ముఖ్యంగా కౌలురైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. కౌలురైతులు లక్ష రూపాయల చొప్పున మిర్చి పంటల్లో నష్టపోయారు, వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం మహాసభ డిమాండ్‌ చేస్తోంది. ఖరీఫ్‌ పూర్తయ్యి నెలపైన అయ్యింది. 20లక్షల టన్నులు ధాన్యం కల్లాల్లో ఉంది. విజయనగరంలో ఇంతకన్నా ముందే వచ్చినా, సేకరణలో జాప్యం జరుగుతోంది. ధాన్యం సేకరణలో మిల్లర్లతో లింకు పెట్టి, వారితో కొనిపించే విధంగా ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ప్రకటనలు ఘనంగా చేస్తోంది, ఆచరణలో విఫలమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ప్రభుత్వం మిల్లర్లతో లింకు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. అవకాశం ఉంటే కేరళలో మాదిరిగా మద్దతు ధరకు క్వింటాకు వెయ్యి చొప్పున ఇచ్చి పంటలు కొనుగోలు చేయాలి. మిర్చి రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. పంటకు పురుగులు పట్టి నాశనం అయ్యింది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాతావరణం కనబడుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలి. చక్కెర ఫ్యాక్టరీలు సంఖ్య 29 నుండి 5కు పడిపోయాయి. 5లక్షల మంది రైతులు గతంలో వీటిపై బతికేవారు, ప్రస్తుతం లక్షకు ఈ సంఖ్య పడిపోయింది. ప్రభుత్వ సహకారం లేక చక్కెర రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలోని సహకార డైరీలు మూతబడిన కారణంతో అమూల్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమూల్‌ను ప్రోత్సహించడం సరికాదు. ఆయా జిల్లాల్లోని సహకార డైరీల ద్వారా రైతుల నుండి పాలు సేకరించి, వాటిని ప్రభుత్వానికి ఇష్టం వచ్చిన కంపెనీలకు ఇచ్చుకోవాలి. అంతేగాని అమూల్‌ను ప్రోత్సహించి, సహకార డైరీలను నిర్లక్ష్యం చేయడం తగదు. రైతులకు రూ.4బోనస్‌ ఇవ్వాలి. కేరళ తరహాలో రుణమాఫీ చట్టం చేయాలని మహాసభ కోరుతోంది. 980మంది రైతులు గతేడాది ఎపిలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో మూడోస్థానంలో ఉన్నాం. రైతుభరోసా కేంద్రాలు ఇంకా పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి రాలేదు. 5,480రైతుభరోసా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వం ఇటీవల చెప్పింది. మిగిలిన వాటిని కూడా తక్షణమే అందుబాటులకి తేవాలి. రైతుకమిషన్‌కు ఎటువంటి అధికారాలు ఇవ్వలేదు. ఇలా అయితే రైతుభరోసా కేంద్రాలు ఎలా నిర్వహిస్తాయి? తక్షణమే రైతు కమిషన్‌కు అధికారాలిచ్చి, రైతు భరోసా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు సహకారంగా నిలవాలి. అప్పుడే సంక్షోభంలో ఉన్న రైతులను కాపాడగలుగుతారు. ధాన్యం, పత్తి, మిర్చి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర మహాసభ కోరుతోంది'' అన్నారు.