Feb 02,2022 08:29
  • ట్రైబల్‌కు రూ.8,451.92 కోట్లు
  • సామాజిక న్యాయం, సాధికారతకు రూ.13,134 కోట్లు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌లో సంక్షేమానికి నిధుల కేటాయింపు స్వల్పంగానే పెరిగింది. ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటును లెక్కలోకి తీసుకుని చూస్తే ఈ పెరుగుదల నామ మాత్రమే. గతేడాది బడ్జెట్‌లో గిరిజన సంక్షేమానికి రూ.7,524.87 కోట్లను కేటాయించగా, ఈసారి బడ్జెట్‌లో దానిని రూ.8,451.92 కోట్లకు పెంచారు. గతంతో పోల్చితే రూ.927.05 కోట్లు మాత్రమే పెరిగింది. ఎస్‌సి, బిసి సంక్షేమం కేటాయింపుల్లోనూ పెద్దగా పెరుగుదల లేదు. సామాజిక న్యాయం, సాధికారతకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.13,134 కోట్లను కేటాయించారు. 2021-22 వార్షిక బడ్జెట్‌లో ఈ విభాగానికి రూ.10,317 కోట్లను కేంద్రం కేటాయించింది. తాజా బడ్జెట్‌లో ఎస్‌సి విద్యార్థులకు ఉన్నత విద్యా సౌకర్యాలను కల్పించేందుకు రూ.5,660 కోట్లను కేటాయించింది. ఎస్‌సి, బిసి, సఫాయి కర్మచారి జాతీయ కమిషన్లకు గతంలో రూ.49 కోట్లను కేటాయించగా, ఈసారి అది రూ.56 కోట్లకు పెరిగింది. అయితే, దళితులకు స్వయం ఉపాధి కల్పించే ఎస్‌సి కార్పొరేషన్లకు మాత్రం నిధులేమీ కేటాయించలేదు. వల్నరబుల్‌ వర్గాలకు గతంలో రూ.2,140 కోట్లను కేటాయించగా, దానిని రూ.1,931 కోట్లకు తగ్గించారు. గిరిజన సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో ఆ వర్గాల అభివృద్ధి కోసం రూ.4,111.38 కోట్లను ప్రత్యేకించారు. మహిళా, శిశు సంక్షేమాభివృద్ధికి అత్తెసరుగానే నిధులను పెంచడం గమనార్హం. 2021-22 వార్షిక బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.24,435 కోట్లను కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో దానిని రూ.25,172 కోట్లకు పెంచారు. మొత్తంగా చూస్తే రూ.737 కోట్లనే కేంద్రం పెంచింది. ఇందులో అంగన్‌వాడీలు, పోషణ్‌2.0 పథకానికి రూ.20,263.07 కోట్లను కేంద్రం కేటాయించింది. బాలిక హక్కుల పరిరక్షణకు గతంలో రూ.10 కోట్లుండగా, ఈసారి కూడా అంతే మొత్తాన్ని కేటాయించారు. జాతీయ మహిళా కమిషన్‌కు గతంలో మాదిరిగానే రూ.27 కోట్లనే కేటాయించారు.