సమరశీల పోరాటాలు.. సిపిఎం రాష్ట్ర మహాసభలో రాజకీయ నిర్మాణ నివేదికను ప్రవేశపెడుతూ కార్యదర్శి మధు
* రాష్ట్రాన్ని మోసం చేసిన బిజెపి
* కనీస వేతనాలు, రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
* బిజెపితో కలిసేందుకు ఉవ్విళ్లూరుతున్న వైసిపి, టిడిపి
ప్రజాశక్తి - జక్కావెంకయ్య,టి నరసింహయ్య, సున్నం రాజయ్యనగర్ (తాడేపల్లి) : కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో సిపిఎం పెద్దఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని ఎండగట్టడంతోపాటు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలపైనా విస్తృతమైన పోరాటాలు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని జక్కావెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్యనగర్లోని టి.షడ్రక్, రెడ్డిశ్రీరామ్మూర్తి ప్రాంగణం (సిఎస్‌ఆర్ కళ్యాణమండపం)లో సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గత మహాసభ నుండి ఇప్పటి వరకూ రాష్ట్రంలో సిపిఎం నిర్వహించిన కార్యకలాపాలపై రాజకీయ నిర్మాణ నివేదికను మధు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించామని తెలిపారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టుకు కొర్రీలు పెడుతున్నారని, పునరావాసం నుండి తప్పుకుంటోందని, వెనుకబడిన జిల్లాలకు అన్యాయం చేసిందని, కడప స్టీలు, ప్రత్యేక రైల్వేజోన్ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. పైగా రాష్ట్రంలో కీలకమైన విశాఖ స్టీలు ప్లాంటును అమ్మకానికి పెట్టిందన్నారు. అయినా అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు బిజెపితో దోస్తీకోసం పోటీపడుతున్నాయని అన్నారు. రాజకీయంగానూ, ఆర్థికంగానూ, సామాజికంగానూ అన్ని రంగాల్లో మార్పులు తెచ్చేందుకు చర్యలు చేపట్డంతోపాటు కార్పొరేట్ సంస్థలకు భజన చేస్తోందన్నారు. వీటిపై ప్రజావ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు ప్రజల్లో చీలికలు తేవడం కోసం ఎన్‌ఆర్‌సి తీసుకొచ్చారని అన్నారు. పూర్తిగా ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న బిజెపికి పార్లమెంటులో వైసిపి, టిడిపి మద్దతిస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడిన వైసిపి అధికారంలోకి రాగానే మద్దతు తెలిపిందన్నారు. అంతకుముందు 2014లో టిడిపి అధికారంలోకి రాగానే బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంలో చేరిందని పేర్కొన్నారు. అయినా రెండు పార్టీలూ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాయని, బిజెపి చెప్పినట్లు చేసుకుపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆదాయం పడిపోతోందని, కనీస మద్దతు ధర లేకుండా పోయిందని, పురుగుపట్టి పంటలు పాడవుతున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారని అన్నారు. కౌలు రైతును పట్టించుకోవడం లేదు, కనీస వేతన చట్టాలను అమలు చేయడం లేదని తెలిపారు. ఇలాంటి నిరంకుశ ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం తొలి నుండీ పోరాడుతోందని తెలిపారు. అమరావతి రాజధానిలోనే ఉండాలని సిపిఎం తెలిపిందని, దానికోసం శాయశక్తులా పోరాడి నిలబడిందని వివరించారు.

నూతనంగా తీసుకొచ్చిన ఇసుక పాలసీతో పేదలు చితికిపోతున్నారని, నిత్యావసర ధరలు నియంత్రించాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని సిపిఎం అలుపెరుగకుండా పోరాడుతోందని వివరించారు. కౌన్సిల్‌ను రద్దుచేస్తే తొలిగా వ్యతిరేకించామని, నాలుగేళ్లలో రైతులు, కూలీలు, అసంఘటితరంగ కార్మికులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, దళితులు, మైనార్టీలు తదితరులకు జరిగిన అన్యాయాలపై నికరమైన పోరాటాలు చేశామని తెలిపారు. కరోనా కాలంలో వలస కార్మికుల కోసం రాష్ట్రంలో ఏ పార్టీ చేయలేని విధంగా సేవా కార్యక్రమాల నిర్వహించామన్నారు. పార్టీ కార్యాలయాలనే ఐసోలేషన్ సెంటర్లుగా మార్చామని, కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలు అందించారని వివరించారు. ఒకవైపు ప్రజా పోరాటాలు, మరోవైపు సేవా కార్యక్రమాలతో సిపిఎం సమరశీలంగా ముందుకెళుతోందని అన్నారు.











